Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ముందు
- మోడల్ స్కూల్స్ సిబ్బంది ధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్, హాస్టళ్ల పరిధిలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు జె.వెంకటేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్లోని రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం ఎదుట మోడల్ స్కూల్స్, హాస్టళ్లలోని బోధనేతర సిబ్బంది ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జీవో 117 తీసుకొచ్చి ఉన్నా వేతనాల మీద 30 శాతం పెంచడం వల్ల వారికి కేవలం 1500 రూపాయల వేతనం మాత్రమే పెరిగిందని తెలిపారు. మోడల్ స్కూళ్ల బోధనేత సిబ్బంది వేతనాలు 10 నెలలుగా పెండింగ్లో ఉన్నాయన్నారు. ఆ పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకే ఆవరణలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి వేరువేరు జీవోలు ఉండటం అధికారుల అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. కార్మికులతో పనిచేయించుకోవడంపై ఉన్న శ్రద్ధ వారికి వేతనాలు నిర్ణయించడంలో చూపెట్టడం లేదని విమర్శించారు. ఒక్కో జిల్లాకు ఒక్కోరకంగా నిధులు విడుదల చేసి ఉద్యోగులు, కార్మికులను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి నేడు రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని హెచ్చరించారు. యూనియన్ రాష్ట్ర కన్వీనర్ ఎడ్ల రమేష్ మాట్లాడుతూ మోడల్ స్కూల్స్, హాస్టళ్లు కేజీబీవీ తరహాలో నడుస్తున్నాయని తెలిపారు. తమ కుటుంబాలను వదులుకొని పిల్లలకు 24 గంటలూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న కార్మికులను పట్టించుకోకపోవడం చాలా శోచనీయమని విమర్శించారు. 24 గంటల పని విధానాన్ని రద్దుచేసి వారికి డ్యూటీ చార్జ్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనం ఇచ్చి పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంతోష, రేణుక, గీత, రాణి, సుజాత, లక్ష్మి, పద్మ, స్వప్న, స్కూల్ బోధనేతర సిబ్బంది యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కల్లేపల్లి సంజీవ్, చంద్రయ్య, భాస్కర్ నాయక్, ఇలియాస్ తోకియ, లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.