Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ జాతీయ సెమినార్ లోగో ఆవిష్కరణలో జీవన్‌లాల్, జూలకంటి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అడవిపై సంపూర్ణ హక్కు గిరిజన జాతికే ఉంటుందని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ (ఆర్మ్) జాతీయ సమావేశాల ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు, తెలంగాణ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ లావుడ్యా జీవన్ లాల్, మాజీ శాసన సభ్యులు జూలకంటి రంగారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ రెండు నుంచి ఐదోతేదీ వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఆర్మ్ జాతీయ సమావేశాల లోగోను వారు మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అవిష్కరించారు. ఈ సందర్భంగా జీవన్‌లాల్ మాట్లాడుతూ శతాబ్దాలుగా అడవిని కాపాడుతూ వస్తున్న గిరిజనులే దేశానికి నిజమైన వారసులన్నారు. అడవి పై సంపూర్ణ హక్కు వారికే ఉంటుందని చెప్పారు. గిరిజన హక్కులకై ఆయా తెగలు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అడవుల్లో ఉన్న విలువైన ఖనిజ సంపదను బడా కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన గిరిజన హక్కులను కాపాడుకోవడానికి హైదరాబాదులో జరిగే ఆదివాసీ జాతీయ సమావేశాలు వేదిక కావాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలు జరుపుకుంటున్న తరుణంలోనూ గిరిజనులు విద్య, వైద్యం వంటి సౌకర్యాలకు దూరంగా ఉండటమేంటని ప్రశ్నించారు. ఇప్పటికీ తిండి గూడు లేక పసిపిల్లల్ని సైతం అమ్ముకునే దుస్థితి ఇంకా కొనసాగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. జూలకంటి రంగారెడ్డి గారు మాట్లాడుతూ బేజీపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశ పెట్టలేదని ఆరోపించారు. రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను కాలరాస్తూ వారికి ద్రోహం చేస్తున్నదని తెలిపారు. వారి జనాభా నిష్పత్తి ప్రకారం రాష్ట్రంలో పెంచాల్సిన రిజర్వేషన్లను పెంచకుండా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో జరిగే గిరిజన ఉద్యమాలన్నింటిని ఒకే వేదిక మీద తీసుకువచ్చి ఐక్య ఉద్యమాల నిర్వహించడం కోసమే జాతీయ సమావేశాలు జరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేశామని చెబుతూనే మరోవైపు అడవులపై ఆధారపడ్డ కోట్లాదిమంది ఆదివాసులను అడువుల నుంచి వెళ్లగొట్టేందుకు నూతన అటవీ నియమాలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. సంఘం అధ్యక్షులు ఎం ధర్మానాయక్ అధ్యక్షతన జరిగిన లోగో ఈ కార్యక్రమంలో ఓయు ప్రొఫెసర్ డాక్టర్ దనుంజరునాయక్, ఆలిండియా బంజారా సేవా సంఘం నాయకులు సోమ్లానాయక్, గిరిజన గురుకుల కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్‌నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు గుగులోత్ ధర్మ, ధిరావత్ రవినాయక్, భూక్యా వీరభద్రం, మూడ్ బాలు నాయక్, కొర్రాశంకర్ నాయక్, కృష్ణ నాయక్, బాల్యా, రామ్‌కుమార్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.