Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికవేడిని తట్టుకుంటాయి
- తొలివిడతలో గ్రేటర్లో ఏర్పాటు: టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు
- విద్యుత్ సౌధలో సమూహిక జాతీయగీతాలాపన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో అన్ని వర్గాల వారికి నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాయని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు అన్నారు. దానిలో భాగంగా విద్యుత్ సరఫరాకు ఉపయోగించే సాంప్రదాయక అల్యూమినియం కండక్టర్ల (ఏసీఎస్ఆర్) స్థానంలో అధిక వేడిని సైతం తట్టుకునే సామర్ధ్యంతో ఆధునిక సాంకేతికతో కూడిన 'హై టెంపరేచర్ లో సాగ్ (మెచ్టీఎల్ఎస్)' కండక్టర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వీటిని గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు వినియోగిస్తున్నామనీ, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేస్తామన్నారు. మంగళవారం విద్యుత్ సౌధలో సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులు, అధికారులతో కలిసి ఆయన జాతీయ గీతం ఆలపించి, మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న టీఎస్‌బీపాస్‌తో పట్టణీకరణ పెరుగుతున్నదనీ, ఫలితంగా విద్యుత్ వినియోగమూ పెరుగుతున్నదని తెలిపారు. దానితోపాటు వ్యవసాయ వినియోగదారులకు 24 గంటల విద్యుత్ సరఫరా, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్లతో పాటు పరిశ్రమలకూ నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి భావితరాలకు తెలియాలనే ఉద్దేశ్యంతోనే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు 75 ఏండ్ల వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయని వివరించారు. కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.