Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గీతాలాపన
- ఆబిడ్స్ సెంటర్లో పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు
- పలుచోట్ల పాల్గొన్న మంత్రులు, ఉన్నతాధికారులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జాతీయ గీతం జనగణమనకు రాష్ట్ర ప్రజానీకం గౌరవóవందనం చేసింది. సామూహిక గీతాలాపనతో రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలాపనలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో ఆబిడ్స్‌లోని నెహ్రుసెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రధమ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. సరిగ్గా ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతం 'జనగణమన'ను సీఎంతో పాటు వేలాది మంది విద్యార్థులు, అధికారులు, ప్రజలు ఆలపించారు. జీపీఓ చౌరస్తాకు చుట్టుపక్కల ఉన్న భవనాలపై కళాకారుల బృందాల సభ్యులు, నాలుగురోడ్లపైనా వేలాది మంది విద్యార్థులు, ప్రజలు ఎక్కడికక్కడ నిలబడి తమ గొంతులన్నీ కలిపి 'జన గణ మన అధినాయక జయహే...' అంటూ ఏఖోన్ముకులై పాడటంతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది. గీతాలాపన అనంతరం 'బోలో స్వతంత్ర భారత్‌కీ జై' నినాదంతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఈ కార్యక్రమంలో వజ్రోత్సవ కమిటీ చైర్మెన్, ఎంపీ కే.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, హైదరాబాద్ ఎంపీ అసద్దుద్దీన్ ఓవైసీ, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బేతి సుభాష్‌రెడ్డి, ఏ.జీవన్‌రెడ్డి, పలు కార్పొరేషన్ల చైర్మెన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11:30 గంటలకు అన్ని ముఖ్యకూడళ్లలో నిమిషం పాటు రెడ్ సిగళ్లు వేశారు. వాహనదారులంతా రోడ్డుపైనే సామూహికం గా ఎక్కడికక్కడ జనగణమన పాడారు.
ఔటర్ రింగ్‌రోడ్డులో స్పీకర్ పోచారం...
బాన్సువాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఔటర్ రింగ్ రోడ్డు పక్కన తన కాన్వారు ఆపారు. సరిగ్గా 11:30 గంటలు కాగానే తన సిబ్బందితో కలిసి జనగణమన పాడారు.
సచివాలయంలో...
రాష్ట్ర సచివాలయంలో జరిగిన సామూహిక జాతీయ గీతాలాపనలో స్పెషల్ సీఎస్ రాణి కుముదిని, సునీల్ శర్మ, ముఖ్యకార్యదర్శి రవి గుప్త, అడిషనల్ సెక్రెటరీ చంపాలాల్, సచివాలయ అధికారులు పాల్గొన్నారు.
మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో..
స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగిన గీతాలాపనలో మంత్రులు హరీశ్‌రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం 30 వేల మంది విద్యార్థులుతో కలిసి జాతీయ గీతాలాపన చేశారు.
గౌలిదొడ్డిలో మంత్రి కొప్పుల..కవాడీగూడలో సునితాలక్ష్మారెడ్డి
మువ్వన్నెల జెండా మన ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలోని గురుకులంలో జరిగిన జాతీయ గీతాలాపనలో ఆయన పాల్గొన్నా రు. కవాడీగూడలో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునితాలక్ష్మారెడ్డి హాజరయ్యారు.