Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రకోట ప్రసంగంపై మంత్రి కేటీఆర్ విమర్శ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నిర్దేశించించుకున్న లక్ష్యాలను సాధించడానికి కావాల్సిన చిత్తశుద్ది ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఎర్రకోట నుంచి ఆయన చేసిన ప్రసంగంపై విమర్శ చేశారు. ప్రధాని మోడీ 2047 సంవత్సరం నాటికి సాధించాల్సిన కొత్త లక్ష్యాలపై చెప్పిన మాటలు వినసొంపుగా ఉన్నాయనీ, అసలు కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేసిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్న విషయం గమనించాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు. 2022 నాటికి దేశ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని 2014 లో చేసిన వాగ్ధానం ఏమైందని ప్రశ్నించారు. 2022 నాటికి ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు, కరెంటు, టాయిలెట్ కల్పిస్తామని 2014లో హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే 2022 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్ డాలర్లుగా మారుస్తానని 2018లో చేప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అలాగే 2022 నాటికి ప్రతి భారతీయుడికి సొంత ఇండ్లు కట్టిస్తామని 2018లో చెప్పారనీ, ఆ ఇండ్లు ఎక్కడున్నాయని అడిగారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఆయన ఆచరణలో చూపలేదనీ, కేవలం ఎన్నికల సమయంలో ప్రజల్ని మాయ చేసేందుకే ఇలాంటి వాగ్ధాటి ప్రదర్శిస్తుంటారని ఎద్దేవా చేశారు.