Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీజీపీ, మానవ హక్కుల కమిషన్‌కు జడ్సన్ ఫిర్యాదు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆజాదీ కా అమృతోత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గాల్లో కాల్పులు జరపడం పట్ల టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్క జడ్సన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చుట్టూ వందలాది మంది గుమిగూడి ఉండగా పోలీస్ అధికారి చేతిలో ఉన్న ఎస్ఎల్ఆర్ తీసుకుని మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారని పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఇదే అంశంపై ఆయన డీజీపీ, జాతీయ మానవ హక్కుల కమిషనర్‌కు జడ్సన్ ఫిర్యాదు చేశారు. ఆ జిల్లాల్లో కాల్పుల ఘటన కలకలం రేపడంతో రబ్బర్ బుల్లెట్లతో కాల్పులు జరిపినట్టు మంత్రి బుకాయిస్తున్నారని పేర్కొన్నారు. ఆయుధ చట్టాల ప్రకారం పోలీసుల ఆయుధాలను ఇతరులు వినియోగించడం చట్ట విరుద్ధమనీ, ఇది కచ్చితంగా నేరమేనని తెలిపారు. పోలీసుల ఆయుధాలతో కాల్చడమే కాకుండా, అనవసరంగా కాల్పులు జరపడమూ నేరమేవుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రిపై తగిన చర్యలు తీసుకోవాలని జడ్సన్ డిమాండ్ చేశారు.