Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రాల్లో 22న మానవహారాలు
- 25,26 తేదీల్లో కలెక్టరేట్ల ఎదుట వంటావార్పు
- వీఆర్ఏ జేఏసీ నేతల ప్రకటన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పేస్కేలు, వారసులకు ఉద్యోగాలు, ప్రమోషన్ల జీవోలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా పేస్కేలు జాతర(ధూంధాం) నిర్వహించనున్నట్టు వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ ఎం.రాజయ్య, సెక్రటరీ జనరల్ ఎస్కే దాదేమియా, కన్వీనర్ సాయన్న, కో-కన్వీనర్లు వంగూరు రాములు, వెంకటేశ్‌యాదవ్, ఎస్కే రఫి, ఎన్.గోవింద్, కంది శిరీషరెడ్డి, వై.సునిత, ఎల్.నరసింహారావు, మాధవ్నాయుడు, అన్ని జిల్లాల జేఏసీ చైర్మెన్లు సంయుక్తంగా ప్రకటించారు. భవిష్యత్ కార్యాచరణను కూడా వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో వారు విలేకర్ల సమావేశాన్నినిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ నెల 18,19, 20 తేదీల్లో వీర్ఏల పేస్కేలు కోసం జాతర(ధూంధాం)లో భాగంగా జిల్లా కేంద్రాల్లో డప్పునృత్యాలు, బ్యాండ్ వాయిద్యాలు, బతుకమ్మలు, బోనాలు, తదితర సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలని వీఆర్ఏలకు పిలుపునిచ్చారు. 22న మండల కేంద్రాల్లో ఉద్యోగ సంఘాలు, సామాజిక సంఘాలు, కార్మిక సంఘాలతో కలిసి మానహారాలు నిర్వహించాలని కోరారు. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు జిల్లా కలెక్టరేట్ల ఎదుట 48 గంటల మహాధర్నా, వంటావార్పు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. వీఆర్ఏల న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.