Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల తొలగింపు
- గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై భరోసా కరువు
- పునర్నియామకంపై స్పష్టతివ్వని ప్రభుత్వం
- ఉపాధి కోల్పోయిన 133మంది ఆరోగ్య కార్యకర్తలు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైంది. బడిలో జ్వరమొస్తే.. కనీసం మందు గోలి ఇచ్చే వారు కరువయ్యారు. ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసిన ఏఎన్ఎంల(ఆరోగ్య కార్యకర్తలు)ను ప్రభుత్వం అర్ధాంతరంగా తొలగించింది. నెల రోజులు గడుస్తున్నా.. పునర్ నియామకంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టతనివ్వడం లేదు. ఏఎన్ఎంలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేదని తెలుస్తోంది. అసలే వర్షాకాలం.. సీజనల్ వ్యాధులు, వైరల్ ఫీవర్ ప్రబలే సమయంలో.. ఆశ్రమ పాఠశాలల్లో ఆరోగ్య కార్యకర్తలు అందుబాటులో లేకపోతే విద్యార్థులకు అనారోగ్యం చేస్తే ఎలాగనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఉన్న ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణ భారంగా మారడంతో ఏఎన్ఎంలు సైతం తిప్పలు పడాల్సి వస్తోంది.
ప్రభుత్వ నిర్ణయం కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 133మంది ఏఎన్ఎంలు ఉద్యోగాలు కోల్పోయారు. విధుల్లోకి తీసుకోవాలని ఏఎన్ఎంలతోపాటు ప్రజా సంఘాల నేతలు సైతం పలుమార్లు ఆందోళనలు నిర్వహించినా ఫలితం లేకుండా పోతోంది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం 2002లో ఏఎన్ఎంలను నియమించింది. జిల్లాలో 133 ఆశ్రమ పాఠశాలల్లో 40,427మంది విద్యార్థులున్నారు. పాఠశాలకు ఒక ఏఎన్ఎంను నియమించింది. వీరికి తొలుత ఐటీడీఏ నుంచి నెలకు రూ.800చొప్పున వేతనం అందించగా.. రెండేండ్ల కిందట రూ.4వేలు పెంచి రూ.5వేల చొప్పున ప్రతి నెలా వేతనం అందజేసింది. ఇది వరకు ఐటీడీఏ నుంచి వేతనాలు అందించగా.. రెండేండ్ల నుంచి వీరి ఉద్యోగాలను ప్రభుత్వం పొరుగు సేవల కిందకు మార్చి నిర్వహణ బాధ్యతను ఓ సంస్థకు అప్పగించింది. తాజాగా జూన్ నెలతో పొరుగు సేవల ఏజెన్సీ కాలపరిమితి ముగియడంతో ఏఎన్ఎంలు ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. ప్రభుత్వం వారి పునర్నియామకంపై దృష్టిసారించడం లేదు. ఏఎన్ఎంలు చేయాల్సిన పనిని ఆయా పాఠశాలల్లో సామాన్య, సాంఘిక శాస్త్రం బోధించే ఉపాధ్యాయులకు అప్పగించింది. కానీ వీరికి పాఠ్యాంశాల బోధనతోపాటు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడటం కష్టతరంగా మారుతోంది.
గిరి విద్యార్థులపై నిర్లక్ష్యం
ఏజెన్సీ ప్రాంతంలో పారిశుధ్యం లోపించడం మూలంగా ప్రతి యేటా విష జ్వరాలు ప్రబలడం సాధారణంగా ఉంటుంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం కాగానే ఆ ప్రాంతంలోని పీహెచ్సీలు రోగులతో నిండిపోతుంటాయి. అలాంటి ప్రాంతాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లోనూ తరచూ విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతుంటారు. వైరల్ జ్వరాలు, వాంతులు, విరేచనాలు తదితర వ్యాధుల బారినపడి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మూడు నెలల కిందట నార్నూర్ మండలం జాండ ఆశ్రమ పాఠశాలలో ఓ విద్యార్థిని టైపాయిడ్ జ్వరంతో మృతిచెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ ఆశ్రమ పాఠశాలలో నలుగురు విద్యార్థులు అనారోగ్యం బారినపడటంతో సిబ్బంది రిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు. అంతకుముందు పలుమార్లు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంలను తొలగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అందుబాటులో ఉంటే నయం..!
ఆశ్రమ పాఠశాలల్లో ఇది వరకు ఏఎన్ఎంలు ఎల్లప్పుడూ విద్యార్థులకు అందుబాటులో ఉండేవారు. పిల్లలు చిన్నపాటి జ్వరం, జలుబు తదితర లక్షణాలతో బాధపడితే అవసరమైన ట్యాబ్లెట్లు అందించేవారు. నిరంతరం వారి ఆరోగ్యాన్ని పరిరక్షించేవారు. తాజాగా ప్రభుత్వం వీరిని విధుల్లో నుంచి తొలగించడంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్బీఎస్కే బృందం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి, స్థానిక పీహెచ్సీల నుంచి ప్రతి మూడు రోజులకు ఒకసారి ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులు నెలలో ఒకసారి ఆయా ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను పరీక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. కానీ సంబంధిత పీహెచ్సీల పరిధిలో పనిచేయడంతోనే సమయం సరిపోని పరిస్థితుల్లో ప్రత్యేకించి ఆశ్రమ పాఠశాలలకు వెళ్లి వైద్య సేవలందిస్తారా అనేది అనుమానంగా మారింది.
ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం: దిలీప్- ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్
ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేసిన ఏఎన్ఎంల విధులను తిరిగి పునరుద్ధరించాలని ఇది వరకే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదు. అయినప్పటికీ ఆశ్రమ పాఠశాలల్లో వైద్య సేవలు అందించేలా ఉన్నతాధికారుల ఆదేశంతో ప్రత్యామ్నాయ కార్యాచరణ రూపొందించాం. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారిస్తాం.