Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరిసిల్లలో పాదయాత్ర, కలెక్టరేట్ వద్ద ధర్నా
- సీపీఐ(ఎం) నాయకుల అరెస్ట్
- హక్కు పత్రాలు ఇచ్చే వరకు పోరాడుతామంటూ.. నినదించిన పోడు రైతులు
నవతెలంగాణ - సిరిసిల్ల టౌన్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం చేపట్టిన పోడు రైతుల మహా ధర్నాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించిన సీపీఐ(ఎం) నాయకులు, రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో పలువురు మహిళలు గాయపడ్డారు. అనంతరం వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోడు రైతుల సమస్యల పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన చేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం కలెక్టరేట్ వద్ద రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. కోనరావుపేట మండలం మరిమడ్ల, శివంగలపల్లి, వీర్నపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల పోడు రైతులు.. తమ సమస్యలు పరిష్కరించాలని, హక్కుపత్రాలు ఇవ్వాలని, అటవీ శాఖ అధికారుల ప్లాంటేషన్ పనులు నిలిపివేయాలని, పోడు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనలో పాల్గొన్నారు. నినాదాలతో హౌరెత్తించారు. కలెక్టర్ వెంటనే వచ్చి పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని, లేకుంటే అక్కడినుంచి వెళ్లేది లేదని బైటాయించారు. అనంతరం బారికేడ్లను తోసుకుంటూ కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట నెలకొంది. ఈ ఘటనలో మహిళా పోడు రైతులకు, నాయకులకు గాయాలయ్యాయి. వెంటనే సంఘటన స్థలానికి సీఐ అనిల్ కుమార్ చేరుకొని నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అరెస్ట్ అయిన వారిలో జిల్లా కార్యదర్శి మూషం రమేష్, జిల్లా కమిటీ సభ్యులు కోడం రమణ, మల్లారపు అరుణ్ కుమార్, ఎర్రవెల్లి నాగరాజు, మల్లారపు ప్రశాంత్, నాయకులు మనోజ్ కుమార్, దిలీప్ ఉన్నారు.
అనంతరం మహిళా పోడు రైతులు పోలీస్స్టేషన్ వరకు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి తమ నాయకులను విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. పేద గిరిజన, దళిత రైతులు 30 ఏండ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. తెలంగాణ అవతరించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ కలెక్టరేట్లో అఖిలపక్ష పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పోడు రైతులకు పట్టాలు ఇస్తామని చెప్పారన్నారు.
ఇచ్చిన హామీ అమలుపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే ఫారెస్ట్ అధికారులు వచ్చి ప్లాంటేషన్ల పేరుతో వేసిన పంటను చెడగొట్టి రైతులపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నాని వాపోయారు. ఇప్పటికైనా పోడు రైతుల సమస్యలు పరిష్కరించాలని, రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, అటవీశాఖ అధికారులు ప్లాంటేషన్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రైతులందరితో సమస్య పరిష్కారం అయ్యేంతవరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తామని జిల్లా కార్యదర్శి మూషం రమేష్ హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎగుమంటి ఎల్లారెడ్డి, ముక్తికాంత అశోక్, జవ్వాజి విమల, సూరం పద్మ, నాయకులు మోర అజరు, గోవిందు లక్ష్మణ్, రమేష్ చంద్ర, గడ్డం ఐలయ్య, లంబాడి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు నరేష్ నాయక్, వివిధ గ్రామాల పోడు రైతులు 300 మంది పాల్గొన్నారు.