Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బస్‌భవన్ ప్రధాన ద్వారం మూసివేత
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఈ ఫోటో చూశారా...ఇది హైదరాబాద్‌లోని టీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్ లోకి వెళ్లే ప్రధాన ద్వారం. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా వీసీ సజ్జనార్ వచ్చాక, వాస్తు పేరుతో ఈ గేటు నుంచి రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ఆ పక్కనే గల్లీలో ఉన్న మరో గేటు నుంచే బస్‌భవన్‌లోకి రాకపోకలు సాగిస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఈ గేట్ కనిపించకుండా పర్మినెంట్‌గా ప్రహరీగోడ నిర్మాణమే చేపట్టారు. బుధవారం ఈ ప్రాంతంలో ప్రహరీ నిర్మాణానికి పునాదులు తీసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. ఆ సమయంలో అక్కడి ఓ ఆర్టీసీ ఉద్యోగిని 'ఏం చేస్తున్నారు?' అని అడిగితే 'ఆర్టీసీకి సమాధి కడుతున్నారు సార్' అంటూ ఆవేదనగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆర్టీసీలో సంస్కరణల పేరుతో తీసుకుంటున్న నిర్ణయాలు ఈ 'సమాధి'ని ధృవీకరిస్తుండటం యాధృచ్ఛికమే! ఉమ్మడి రాష్ట్రంలో ఇదే బస్‌భవన్ ప్రధాన ద్వారం నుంచే ఎమ్‌డీలు, చైర్మెన్లు వెళ్లేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా అప్పటి చైర్మెన్ సోమారపు సత్యనారాయణ, ఎమ్డీ రమణారావు కూడా ఇదే ప్రధాన ద్వారం నుంచి రాకపోకలు సాగించారు. కానీ సజ్జనార్ వచ్చాక ఈ గేటును పూర్తిగా మూసేసి, ఇప్పుడు పర్మినెంట్‌గా ప్రహరీగోడనే కట్టేస్తున్నారు. అయితే ఆర్టీసీకి సమాధి కట్టే నిర్ణయాలు తీసుకుంటున్న యాజమాన్యంపై ఉద్యోగ, కార్మిక, విద్యార్థి, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయనీ, ఆ సంస్కరణల్ని వేగవంతం చేస్తుండటంతో ప్రజా ఉద్యమాల నుంచి 'భద్రత' కోసం అక్కడ గోడ కడుతున్నారని కార్మిక సంఘాలు చెప్తున్నాయి. ఇప్పటికే ఆర్టీసీని నామ్ కే వాస్తేగా ఉంచి, రూట్లు, బస్సుల్ని ప్రయివేటీకరించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న విషయం తెలిసిందే.
ఇలా కనుమరుగు...
టీఎస్ఆర్టీసీ కనుమరుగుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఆ ప్రతిపాదనలు కార్యరూపంలోకి వస్తున్నాయి. ఇప్పటికే సంస్థలో బస్సుల సంఖ్యను తగ్గించి, అదనపు ఉద్యోగులు ఉన్నారంటూ వారిని ఇంటికి పంపేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (వీఆర్ఎస్) అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. జులై 31 వరకు దరఖాస్తుచేసుకున్న ఉద్యోగులను ఈ నెలాఖరుకు రిటైర్ చేయాలని యాజమాన్యం ఇప్పటికే రాతపూర్వక ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 620 మంది వీఆర్ఎస్ తీసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఈ సంఖ్యపై ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
అయితే తాజాగా బస్సు డిపోల విలీనానికి ఆర్టీసీ యాజమాన్యం అధికారికంగా ఆమోద ముద్ర వేసినట్టు విశ్వసనీయ సమాచారం. దానిలో భాగంగా రాణిగంజ్-1,2 డిపోలను ఒకదానిలో మరొకటి విలీనం చేసే ప్రతిపాదనలకు యాజమాన్యం ఆమోదం తెలిపినట్టు తెలిసింది. అలాగే ముషీరాబాద్-1,2 డిపోలనూ ఒకదానిలో మరొకటి విలీనం చేసే ప్రతిపాదనకూ ఓకే చెప్పింది. గురువారం జరిగే టీఎస్ఆర్టీసీ పాలకమండలి (బోర్డు) సమావేశంలో ఈ నిర్ణయాలకు తుది ఆమోదం లభించడం లాంఛనమే! ఈ ఏడాది మార్చిలో బస్‌భవన్ వెనుకనే ఉన్న హైదరాబాద్-3 డిపోను మూసేసిన విషయం తెలిసిందే. అలాగే మెట్పల్లి, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, హుస్నాబాద్ వంటి మరో 15 డిపోలను కూడా ఒకదానిలో మరొకటి విలీనం చేయాలని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు సమాచారం. క్రమేణా వీటిని ఆచరణలోకి తేనున్నారు. ఆర్టీసీలో బస్సుల సంఖ్య తగ్గించారనడానికి డిపోల విలీనమే ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నది. హైదరాబాద్ సిటీలో ఒక్కో డిపోలో 125 షెడ్యూల్స్ కంటే ఎక్కువ బస్సులు ఉంటున్నందున, ప్రయాణీకుల సౌకర్యార్థం, నిర్వహణను సులభతరం చేయడం కోసం ఒక్కో ప్రాంతంలో రెండేసి డిపోలు ఏర్పాటు చేశారు. రాణిగంజ్, ముషీరాబాద్ ప్రాంతాల్లో రెండేసి డిపోలు అలా ఏర్పడినవే! ప్రజారవాణాను ప్రభుత్వం బాధ్యతగా భావించకుండా, పక్కా కమర్షియల్‌గా వ్యవహరిస్తూ బస్సుల సంఖ్యను తగ్గించి, డిపోల విలీనాన్ని చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నది.
ఆదేదో తమ పరిధిలోని అంశం కాదన్నట్టే ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఇటీవల భారీగా వివిధ సెస్సుల పేరుతో బస్సు చార్జీలు పెంచితే, ప్రభుత్వం తనకేం సంబంధం లేనట్టే ఉండటం గమనార్హం. ఇప్పుడు గతంలోకంటే ఆర్టీసీ బస్సు వెళ్లని గ్రామాల సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 95 డిపోలు ఉన్నాయి. ఆదిలాబాద్‌తో పాటు మెదక్ జిల్లా నర్సాపూర్, మహబూబ్‌నగర్ జిల్లా కోస్గీలో మూడు శాటిలైట్ డిపోలను ఏర్పాటు చేశారు. మహబూబాబాద్ బస్ డిపోను మూసేస్తామని ఆర్టీసీ యాజమాన్యం ప్రతిపాదిస్తే, అలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్వయంగా ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్‌కు లేఖ రాసారు. గురువారం బస్‌భవన్‌లో జరిగే బోర్డు సమావేశంలో మరికొన్ని నిర్ణయాలకు ఆమోదం లభించనుంది. అధికారులు ఇప్పటికే అత్యంత రహస్యంగా సమావేశ అజెండా తయారు చేశారు. తమ నిర్ణయాలతో ప్రభుత్వ అధికారులు ఆర్టీసీని బతికిస్తారో...సమాధి కడతారో వేచిచూడాలి!!