Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సిటీబ్యూరో
'దేశాన్ని కులం, మతం పేరుతో విడదీసేందుకు విద్వేషాలు సృష్టిస్తున్నారు. స్వాతంత్య్ర ఫలాలు అందాలంటే కులాలు, మతాలకతీతంగా ఐక్యంగా పోరాడాలే. మన దేశాన్ని చైనా, సింగపూర్, కొరియా దేశాల తరహాలో అభివృద్ధి చేయాలి. అపార సంపద, నదులున్నా ఫలితాలు నామమాత్రంగానే ఉన్నాయి. ఏ సమాజమైతే నిద్రాణమవుతుందో అది దెబ్బతినే ప్రమాదం ఉంది. మోసపోతే గోస పడుతం.. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలె' అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్)ని బుధవారం సీఎం ప్రారంభించారు. ముందుగా త్రివర్ణ బెలూన్లను ఎగుర వేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.56.20 కోట్లతో నిర్మించిన సమీకృత భవన సముదాయ కలెక్టరేట్ శిలాఫలకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి, కలెక్టరేట్‌ను ప్రారంభించారు. కలెక్టరేట్ భవన సముదాయం అంతటా ముఖ్యమంత్రి కలియతిరిగి పరిశీలించారు. కలెక్టర్ చాంబర్‌లోని కుర్చీలో కలెక్టర్ ఎస్.హరీశ్‌ను సీఎం కేసీఆర్ కూర్చుండబెట్టి, ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. 60 ఏండ్ల కింద పోరాడలేదు కాబట్టే తెలంగాణను ఆంధ్రలో కలిపారని అన్నారు. 58 ఏండ్లు మడమ తిప్పని పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే, తెలంగాణలో ఇంత అభివృద్ధి జరిగేదా? అని ప్రశ్నించారు. దేశంలో జరుగుతున్న విధ్వంస పరిణామాలపై గ్రామీణ ప్రజలు చైతన్యవంతులై చర్చించుకోవాలన్నారు. విచ్ఛిన్నకర శక్తులు, నీచులు, దుర్మార్గులు ఉంటరని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని, అందుకోసం ప్రజలు ఆలోచించాలన్నారు. మన వనరులు మనకే దక్కాయి కాబట్టే తెలంగాణ ఆర్థికంగా బలపడ్డదని చెప్పారు. నేడు తెలంగాణలాగా కరెంటు ఏ రాష్ట్రంలోనూ రాదని, చివరికి దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరంటు 24 గంటలు రాదన్నారు. ప్రజలంతా ఐకమత్యంతో ఉంటూ, రాష్ట్ర ప్రగతికి సహకరిస్తూ ముందుకు పోవాలన్నారు. దేశంలోనే సముజ్వల రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా నిలపాలన్నారు. హైదరాబాద్ నగర శివార్లలోని నియోజకవర్గాల్లో అభివృద్ధి పెరుగుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు చామకూర మల్లారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యులు దీవకొండ దామోదర్‌రావు, మేడ్చల్ జెడ్పీ చైర్మెన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.