Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నదిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు
- ప్రమాదకరంగా మారిన నది
- ప్రశ్నార్థకంగా మారుతున్న ప్రజారోగ్యం
- 21 నుంచి సీపీఐ(ఎం) పోరుయాత్ర
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ఒకప్పుడు ప్రజల దాహార్తిని తీర్చిన మూసీ నది నేడు మురికి కూపంలా మారింది. అనేక పరిశ్రమలు, ఇంటి వ్యర్థాలన్నీ మూసీలోకి వదిలిపెట్టడం వల్ల పూర్తిగా కలుషితమైంది. ఫలితంగా మూసీ పరీవాహక ప్రాంతంలో నీరు కూడా విషపూరితంగా మారింది. సాగునీటి వసతి లేని కారణంగా గత్యంతరం లేక రైతులు ఈ నీటితోనే పంటలు పండిస్తున్నారు. ఒకవైపు ప్రాణకోటికి తిండి పెట్టే భూమి విషపు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే.. మరోవైపు ప్రజల ఆరోగ్యం, పశు, మత్స్య సంపదతో పాటుగా సమస్త జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితిలో మూసీనదిని జల కాలుష్యం నుంచి రక్షించాలన్న డిమాండ్‌తో ఈనెల 21 నుంచి సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లాలో 'పోరు యాత్ర'కు సిద్దమైంది.
మూసీ పుట్టుక..
మూసీ నది వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టింది. అక్కడి నుంచి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా వాడపల్లిలో ముగుస్తుంది. దాదాపు 250కిలోమీటర్ల పొడవు ఈ నది విస్తరించింది. ఒక రాష్ట్రంలో పుట్టి.. అదే రాష్ట్రంలో ముగింపు కలిగిన ఏకైక నది మూసీ నది మాత్రమే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూసీ నది పోచంపల్లి మండలంలో ప్రారంభమై సూర్యాపేట ప్రాంతంలో ముగుస్తుంది. ఈ నది ఏరియా ప్రాంతంలో ఉమ్మడి జిల్లాలో అయితే సుమారు 3లక్షల ఎకరాల్లో పంట సాగు కాగా.. యాదాద్రి భువనగిరి జిల్లాలో లక్షకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు.
కాలుష్యానికి కారణం
మూసీ నది పరివాహక ప్రాంతం మొత్తంగా సుమారు 12వేల పరిశ్రమలు ఉన్నాయి. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సర్వే ప్రకారం జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం నుంచి ప్రతి రోజూ మిలియన్ లీటర్ల సాధారణ, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తున్నట్టు తెలుస్తోంది. రెండేండ్ల కిందట దాదాపు 350మిలియన్ లీటర్ల కాలుష్యం మూసీ నదిలో కలవగా, ఇప్పుడు అది 1625 మిలియన్ లీటర్ల స్థాయికి చేరినట్టు తెలుస్తుంది. ప్రధానంగా పట్టణీకరణ ద్వారా మరియు ప్రణాళిక లేని నిర్మాణాల ద్వారా పారిశ్రామిక వ్యర్థాల డంపింగ్ ద్వారా కాలుష్యం పేరుకుపోయింది ఇంటి వ్యర్థాలు, రసాయనాలతో కూడిన డిటర్జెంట్ మురికి నీరు కూడా మూసీలో చేరిపోతుంది. దాంతో మొత్తంగా మూసీ నది ఉనికికే ప్రమాదం ఏర్పడి మానవాళిని కబలించే మురికి కూపంగా మారిపోయింది.
అత్యంత ప్రమాదకరమైన మూసీ
ఎంత గొప్ప చరిత్ర కలిగి ఉందో మూసీ నది నేడు అంత అత్యంత కాలుష్యమైన నదిగా తయారైంది. కాలుష్యంపై దాదాపు 104దేశాల్లో 258 నదులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఈ సర్వేల్లో ప్రమాదకరంగా ఉన్న నదుల్లో మూసీ నది 22వ స్థానంలో ఉంది. ఈ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 70కిలోమీటర్ల వరకు నీరు కాలుష్యమైందని, భూగర్భంలో సుమారు 40మీటర్ల లోతు వరకు కాలుష్యం చేరినట్టు ఇటివల ఓ విద్యార్థి బృందం చేసిన సర్వేలో వెల్లడైందని కాలుష్య నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నీటి వల్ల ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, చర్మ వ్యాధులు, గర్భస్రావం, ఆర్థరైటీస్, గొంతునొప్పి, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనిశాస్త్రవేత్తలు చెపుతున్నారు. కనీసం జలచరాలు కూడా బతికే పరిస్థితి లేదు.
మూసీ ప్రక్షాళన కోసం 21 నుంచి సీపీఐ(ఎం) పోరుయాత్ర
యాదాద్రి భువనగిరి జిల్లాలో 17మండలాలకుగాను మూసీ నది బీబీనగర్, చౌటుప్పల్, పోచంపల్లి, భువనగిరి, వలిగొండ, మోత్కుర్, రామన్నపేట, ఆత్మకూర్(ఎం), మూటకొండూరు, అడ్డగూడురు వరకు విస్తరించి ఉంది. సుమారు లక్షకు పైగా ఎకరాల్లో ఈ నీటి వల్లనే పంటలు సాగు చేస్తున్నారు. అయితే, నది పూర్తిగా కాలుష్య కాసారంగా మారడంతో మూసీ ప్రక్షాళన కోసం సీపీఐ(ఎం) ఈనెల 21 నుంచి పోరు యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ యాత్రలో భాగంగా 28వరకు గ్రామాల పర్యటన, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకోనున్నారు. మూసీ కాలుష్యంపై పెద్దఎత్తున గ్రామాల్లో చర్చలు జరిగేలా.. తద్వారా ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభల్లో చర్చ చేసే వరకు ప్రజలు వారిపై ఒత్తిడి తీసుకురావాలని సీపీఐ(ఎం) పిలుపునిస్తుంది.
మూసీ ప్రక్షాళనకు ప్రధాన బాధ్యత కేంద్రానిదే..
ప్రధానంగా పరిశ్రమల వ్యర్థ పదార్థాలతో కలుషి తమవుతున్న మూసీనదిని ప్రక్షాళన చేయకపోతే సకల జీవకోటి మనుగడ ప్రశ్నార్థకంగా మారనుంది. అందుకే మూసీ నది ప్రక్షాళన కోసం కేంద్రమే ప్రధాన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించాలి. ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకొచ్చేలా ఈ పోరు యాత్రలో ప్రజలను చైతన్యం చేస్తాం.
- ఎండి.జహంగీర్,
సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి