Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 13 రాష్ట్రాలపై కేంద్రం ఆంక్షలు
- ఉత్పత్తిదారులకు బకాయిలు ఉన్నారనేదే కారణం
- ఐఈఎక్స్ నుంచి కొనుగోళ్లు అనుమతించేది లేదని హెచ్చరిక
- దేశవ్యాప్త బకాయిలు రూ.5085.30 కోట్లు
- రాష్ట్ర విద్యుత్ సంస్థల బకాయిలు రూ.1,380.96 కోట్లు
- కోర్టుకెళ్తాం-టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కరెంటు ఉత్పత్తి దారులకు బకాయిలు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారనే కారణంతో ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్) నుంచి విద్యుత్ కొనుగోళ్లను అనుమతించబోమని 13 రాష్ట్రాల్లోని 27 విద్యుత్ కంపెనీలకు కేంద్రప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) ద్వారా ఆయా రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. గురువారం అర్థరాత్రి నుంచి బకాయిలు ఉన్న 13 రాష్ట్రాలకు కరెంటును ఇవ్వబోమని తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ సంస్థల బకాయిలు రూ.5,085.30 కోట్లకు చేరినట్టు కేంద్రం ప్రకటించింది. ఈ బకాయిల్లో తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సొమ్మే అధికంగా ఉండటం గమనార్హం.
కేంద్రప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఉత్పత్తి దారులకు రూ.197.67 కోట్లు, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) రూ.104.60 కోట్లు, తెలంగాణ స్టేట్ పవర్ కమిషన్ కంపెనీ అత్యధికంగా రూ.1,078.69 కోట్ల బకాయిలు ఉన్నాయి. మొత్తంగా రాష్ట్ర విద్యుత్ సంస్థల బకాయిలు రూ.1380.96 కోట్లుగా ఉన్నాయి. వాటిని చెల్లిస్తేనే ఐఈఎక్స్ నుంచి కరెంటు కొనుగోళ్లు అనుమతిస్తామని పోస్కో స్పష్టం చేసింది. ఈ నిబంధనలు గురువారం అర్థరాత్రి నుంచే అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటించారు. అయితే దీనిపై టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు పోస్కోకు అత్యవసర మెయిల్ పెట్టారు.
కొనుగోళ్లు బంద్
సాధారణంగా ఐఈఎక్స్ నుంచి విద్యుత్ సంస్థలు కొనుగోలు, అమ్మకాలు చేస్తుంటాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు రూ.5 వేల కోట్లు దాటడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో తాము సొంతంగా తయారు చేసిన విద్యుత్‌తో పాటు వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నవాటి నుంచి విద్యుత్ సరఫరా కొనసాగుతోంది. అత్యవసర సమయంలలో ఈ ఎక్స్ఛేంజీ నుంచి కొనుగోలు చేయాలంటే మాత్రం కుదరదు.
సమస్య ఉండదు...
చాలా రాష్ట్రాలకు తమ అవసరాలకు సరపడా విద్యుత్ సొంత ప్లాంట్ల నుంచి వస్తుంది. అలాగే ప్రైవేట్ కంపెనీల నుంచి కూడా సరఫరా అవుతుంది. ్ట కేంద్రం చర్యల వల్ల పెద్ద నష్టం ఏమీ ఉండదు. సరిపడా విద్యుత్ సరఫరా లేని రాష్ట్రాలకే ఇబ్బంది ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల డిమాండ్ తక్కువగా ఉంటుంది. స్వంత ప్లాంట్లు సరిగ్గా నడుపుకోలేని రాష్ట్రాలు ఇబ్బంది పడుతాయి.
కోర్టుకెళ్తాం... : 'నవతెలంగాణ'తో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ఇబ్బందులు పెట్టడమే లక్ష్యంగా కేంద్రం వ్యవహరిస్తున్నది. విద్యుత్ బకాయిల చెల్లింపుపై రాష్ట్ర హైకోర్టులో స్టే ఉన్నది. రాష్ట్ర విద్యుత్ సంస్థల కొనుగోళ్లు, అమ్మకాలను శుక్రవారం నాటికి స్థిరీకరించాలని పోస్కోను కోరాం. దీనిపై న్యాయస్థానం ఎక్సేంజ్‌లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కొనుగోళ్లకు ఇబ్బందులు సృష్టించొద్దని చెప్పింది. అయినా ఈ తరహా బెదిరింపులతో ఇబ్బంది పెడుతున్నారు. దీనిపై అవసరమైతే సోమవారం కోర్టు ధిక్కరణ పిటీషన్ దాఖలు చేస్తాం. రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశాం. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం.విద్యుత్ సంస్థల యాజమాన్యాలకు ప్రజలు, వినియోగదారులు సహకరించాలి.
బకాయిలు ఇలా.. రాష్ట్రం బకాయిలు (కోట్లలో)
తెలంగాణ 1380.96
తమిళనాడు 926.16
రాజస్థాన్ 500.00
జమ్మూ కాశ్మీర్ 434.00
ఆంధ్రప్రదేశ్ 412.00
మహారాష్ట్ర 381.00
కర్నాటక 355.20
చత్తీస్ఘడ్ 27.49
మణిపూర్ 29.94
మిజోరాం 17.23
మధ్యప్రదేశ్ 230.00
జార్ఖండ్ 214.00
బీహార్ 172.00