Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగిన రోడ్డు నిర్మాణ పనులు
- టోకెన్ పడినా.. చేతికందని బిల్లులు
- కూలీలకు పనులు కరువు
- నిలిచిపోయిన బీటీ, కంకర పనులు
- కారుచౌకగా కెనాల్ రాయి తరలింపు
- ఆందోళనలో మైనింగ్ వ్యాపారులు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
మైనింగ్ వ్యాపారం సంక్షోభంలో కూరుకుపోయింది. రోడ్ల నిర్మాణాలు, భారీ ప్రాజెక్టులకు కావాల్సిన కంకర లేకపోవడంతో పనులు నిలిచి అనేక మంది కూలీలకు పనుల్లేకుండా పోయాయి. ఈ క్రమంలో కొందరు అక్రమార్కులు ఎలాంటి అనుమతుల్లేకుండా.. కెనాల్ నుంచి తీసిన రాయిని తీసుకెళ్లి కంకర తయారు చేస్తూ ప్రభుత్వాదాయానికి గండి కొడుతున్నారు. అయినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. అయితే రాయల్టీ చెల్లించిన మైనింగ్ యజమానులు.. అక్రమార్కుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారు. అనుమతుల్లేకుండా కంక తయారు చేస్తున్న క్రషర్ మిషన్ యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మైనింగ్ యాజమాన్యాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. రోడ్డు పనులు ఆగిపోవడమేగాక.. చేసిన పనులకు బిల్లులు రాక పనులను పూర్తిగా నిలిపేశారు. టోకెన్లు వేసి మూడు నెలలు కావస్తున్నా.. ఎస్ఓఓ నుంచి బిల్లులు రావడం లేదు. పనుల్లేక కార్మికులను కూర్చోబెట్టి వేతనాలు ఇస్తున్నారు. వీరిని ఇంటికి పంపిస్తే.. పనులు మొదలైనప్పుడు కార్మికుల కొరత ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారికి వేతనాలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 320కి పైగా మైనింగ్ మిషన్లు నడుస్తున్నాయి. మరోవైపు అనేక చోట్ల అనుమతుల్లేకుండా స్టోన్ కంకరను తయారు చేస్తున్నారు. జాతీయ రహదారితోపాటు అంతర్గత రహదారుల నిర్మాణానికి ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. ఏడాది కాలంగా పంచాయతీ రాజ్, ఆర్అండ్బీ పనుల్లేక మైనింగ్ వ్యవస్థ మొత్తం చతికిల పడింది. కొత్త రోడ్డు పనుల నిర్వహణ పూర్తిగా నిలిచిపోయింది. బీఆర్ఆర్ మైనింగ్‌కు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో రూ.200 కోట్లకు పైగా ప్రభుత్వం బిల్లులు చెల్లించాలి. ప్రధానంగా కోట్లు ఖర్చు చేసి మైనింగ్ యజమానులు యంత్ర సామాగ్రిని ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో క్రషర్ దగ్గర 50 నుంచి 100 మంది పని చేస్తున్నారు. ఈ క్రమంలో బిల్లులు రాక నిర్వహణ కష్టంగా మారింది.
అనమతులు లేకుండానే కంకర తరలింపు
అనుమతులతో చేసే మైనింగ్ యజమానులు చాలా మంది నష్టాల్లో ఉంటే.. చాలా మంది మైనింగ్ వ్యాపారులు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించలేదు. మైనింగ్ పేరుతో భూమిని ఖరీదు చేయాల్సిన అవసరం లేదు. రాళ్లను వెలికి తీయడానికి ఎటువంటి బ్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇటువంటి స్టోన్ మిషన్లే అధికంగా ఉన్నాయి. వీరు కల్వకుర్తి ఎత్తిపోతలతో పాటు పాలమూరు-రంగారెడ్డి కాల్వల్లో తీసిన రాళ్లను అక్రమంగా తీసుకెళ్త్తున్నారు. వీటితో పాటు భీమా, నెట్టెంపాడులో తీసిన రాళ్లను కారుచౌకగా తరలిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి వారు 200మందికి పైగా ఉన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో కేవలం నాలుగు మైనింగ్ పనులకే అనుమతులున్నాయి. మిగతావి నిబంధనలకు విరుద్ధంగానే కంకర వెలికి తీస్తున్నాయి. గద్వాల, నారాయణపేట, వనపర్తి, మహబూబ్‌నగర్‌లో కూడా అనుమతుల్లేకుండా మైనింగ్ వెలికి తీస్తున్నారు. వీరిపై ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం వల్ల నిజమైన మైనింగ్ వ్యాపారులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు. మైనింగ్ భూముల్లో రాళ్లను వెలికి తీయడానికి చేసే బ్లాస్టింగ్‌కు ఉపయోగపడే అమ్మోనియాను కూడా నిషేధించారు. దీంతో రాళ్లను తీసే దారిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి అక్రమ క్రషర్లపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పనులెలా చేయాలి
నిబంధనలతో మేము పనులు చేస్తున్నాం. కానీ అనుతమతుల్లేని వారు రాత్రింబవళ్లు కెనాల్ ద్వారా రాళ్లను తరలించి కంకరగా మారుస్తున్నారు. మేము లక్షల్లో ఖర్చు చేస్తే.. అనుమతుల్లేని వారికేమో వేలల్లోనే కంకర వస్తోంది. గతంలో మేము హెక్టారుకు రూ.50 వేలు చెల్లించేవారం. ఇప్పుడు లక్ష చెల్లిస్తున్నాం. బ్లాస్టింగ్‌కు వాడే అమ్మోనియా సరఫరా నిలిపేశారు. బిల్లులు కూడా రావడం లేదు. దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాం.
- ధనుంజయ. క్రషర్ యజమానుల సంఘం
ఉమ్మడి జిల్లా అధ్యక్షులు