Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఐకేఎస్ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మద్దతు ధరల చట్టం, కొనుగోలు గ్యారంటీ కోసం దేశవ్యాప్తంగా ఐక్యపోరాటాలు నిర్వహిస్తామని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శ న్రావు అధ్యక్షతన వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీ పాలనలో రైతుల పరిస్థితి మరింత దిగజారిపోయిందన్నారు. పూర్తిగా నష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ అనుసరిస్తున్న మతోన్మాద, కార్పొరేటీకరణ విధానాలే ఈ దుస్థితికి కారణమన్నారు. సంక్షోభం నుంచి రైతన్నలు బయటపడాలంటే, కేంద్రం కనీస మద్దతు ధర పెంచి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సమగ్ర పంటల బీమాను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. కార్పొరేట్లు, భూస్వాములకే బ్యాంకులు విరివిగా రుణాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రతి రైతుకూ బ్యాంకులు సున్నా శాతం వడ్డీకి రుణం ఇచ్చేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లలు తెస్తామంటున్న కేంద్రం చర్యలను తిప్పికొట్టి, కార్మిక చట్టాలను కాపాడుకోవాలని కోరారు. వ్యవసాయ కార్మికుల సంక్షేమం కోసం రూపొందించిన జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని కేంద్రం నీరుగారుస్తోందనీ, దాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రతియేటా 200 రోజుల పని, రోజుకూలి రూ.600 ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు కలిసొచ్చే అన్ని సంఘాలతో ఐక్య, ఉమ్మడి పోరాటాలు చేయాలని, డిమాండ్లు సాధించాలని కోరారు. ఢిల్లీలో ఏడాది పాటు రైతులు నల్లచట్టాలపై చేసిన పోరాటం జయప్రదం ఉదారవాద, నయా సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చిన నాటి నుంచి దేశ వ్యవసాయ రంగంలో సంక్షోభ పరిస్థితులు తీవ్రమవుతూ వచ్చాయనీ, 1997 నుంచి 2014 వరకు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పాలనలో గత ఏడేండ్లలోనే లక్ష మంది పైగా రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారని తెలిపారు. ఏపీలో రోజూ ఏదో ఒకచోట రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్, జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు నంద్యాల నరసింహారెడ్డి, డాక్టర్ అరిబండి ప్రసాదరావు, కాసాని ఐలయ్య, శెట్టి వెంకన్న, సహాయ కార్యదర్శులు మూడ్ శోభన్, మదినేని రమేష్, కున్సోత్ ధర్మా, ఎం శ్రీనివాసులు, పల్లపు వెంకటేశ్, కమిటీ సభ్యులు మాటూరు బాలరాజు, బాల్ రెడ్డి, సత్యనారాయణ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.