Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
- ఆశావర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి. జయలక్ష్మి
నవతెలంగాణ-రాజేంద్రనగర్
తెలంగాణలో ఆశావర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఆశావర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర అధ్యక్షులు పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లోని సీఐటీయూ కార్యాలయంలో గురువారం ఆ సంఘం జిల్లా రెండవ మహాసభ నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం సమావేశంలో జయలక్ష్మి మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టిన చరిత్ర ఆశా కార్యకర్తలకు ఉన్నదన్నారు. సొంత కుటుంబాలను పక్కనపెట్టి ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్న ఆశా కార్మికులకు ఆంధ్ర, కేరళ రాష్ట్రంలో చెల్లిస్తున్నట్టుగా ఫిక్స్డ్ వేతనం తెలంగాణలోనూ అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనం రూ.26వేలు ఇవ్వాలన్నారు. విధుల్లో చనిపోయిన ప్రతి ఆశావర్కర్స్కు ఇన్సూరెన్స్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర బెనిఫిట్లో పర్మినెంట్ చేయాలని కోరారు. అనేక సర్వేల పేరుతో ఆశావర్కర్లపై పనిభారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులు అరికట్టాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ఆశావర్కర్లకు నిధులు కేటాయించాలన్నారు. 2021 జులై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల పీఆర్సీ ఏరియర్స్ అమలు చేయాలన్నారు. కేంద్రం చెల్లించాల్సిన కరోనా రిస్క్ అలవెన్స్ 16 నెలల బకాయిలు విడుదల చేయాలని కోరారు. ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. ప్రమాద బీమా, హెల్త్ కార్డులు, ఇతర పరిష్కారాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు చేయాల్సి అవసరం ఉందన్నారు. అంతకుముందు కాటేదాన్ చౌరస్తా నుంచి సీఐటీయూ కార్యాలయం వరకు ఆశావర్కర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.