Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితుల భూములను లాక్కుంటున్న ప్రభుత్వం
- రాంసాగర్ దళిత రైతులకు రైతుబంధు, రైతుబీమా లేదు: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్
నవతెలంగాణ-కొమురవెల్లి
పేద దళిత రైతుల వద్ద సాగులో ఉన్న భూములకు ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం రాంసాగర్ గ్రామం నుంచి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వరకు పేద దళితులు, రైతులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం తహసీల్ ఎదుట రైతులతో ధర్నా నిర్వహించి, తహసీల్దార్‌కు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామ్సాగర్లో 70 దళిత కుటుంబాల వద్ద ఉన్న 118 ఎకరాల భూములకు ధరణి పోర్టల్ వచ్చిన అనంతరం పాస్‌బుక్కులు లేకుండా పోయాయన్నారు. దాంతో ప్రస్తుతం రైతులకు రైతు బీమా, రైతు బంధు పథకాలు వర్తించకపోగా బ్యాంకు రుణాలు రాక ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో ఉన్న దళిత గిరిజన అణగారిన వర్గాల వద్ద ఉన్న భూములకు హక్కు పొందే అవకాశం లేకుండా ధరణి పోర్టల్ ఉందన్నారు. తెలంగాణలో 9 లక్షల దళిత కుటుంబాలున్నాయని, 6.50 లక్షల కుటుంబాలకు సెంటు భూమిలేదని వారికి టీఆర్ఎస్ ప్రభుత్వం మూడెకరాల భూమి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌ను అడ్డం పెట్టుకొని వారి వద్ద ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు, కాలువల కోసం దళితుల వద్ద ఉన్న ప్రభుత్వ వేల ఎకరాల భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీన పరుచుకుని, వారిని కూలీలుగా మార్చిందని అవేదన వ్యక్తం చేశారు. ధరణి పోర్టల్‌లో మార్పులు చేసి పేదల భూములకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులను ఏకం చేసి ఉద్యమాన్ని లేవనెత్తుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రాళ్ల బండి శశిధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు బక్కేల్లి బాలకిషన్, నాయకులు గొర్రె శ్రీనివాస్, వుల్లంపల్లి సాయిలు, మేకల కృపాకర్, దళిత రైతులు తదితరులు పాల్గొన్నారు.