Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు, నియామకాలు లేక ఇబ్బందులు
- నూతన విద్యావిధానంలో ప్రజాస్వామిక విలువలు కనిపించడం లేదు: ప్రొఫెసర్ హరగోపాల్
- 'సంక్షోభంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు' అంశంపై సదస్సు
నవతెలంగాణ-ఓయూ
విశ్వవిద్యాలయాలు సంక్షోభంలోకి నెట్టబడుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంలో సామాజిక న్యాయం, లౌకిక భావన, ప్రజాస్వామిక విలువలు కనిపించడం లేదని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీ జాక్) ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన లైబ్రరీలోని ఐసీఎస్ఎస్ఆర్ హాల్లో 'సంక్షోభంలో తెలంగాణ విశ్వవిద్యాలయాలు' అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. నూతన జాతీయ విద్యా విధానంలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం తన ఐడియాలజీని ఇక్కడ అమలు చేస్తుందని అన్నారు. దీని వల్ల విద్యార్థులు నష్టపోవడంతోపాటుగా భవిష్యత్లో ప్రయివేటీకరణకు ఊతమిస్తుందన్నారు. రాష్ట్రాలను సంప్రదించకుండా పూర్తి విద్యావిధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచే అన్నీ నడుపుతామంటే ఈ విశాలమైన దేశంలో ఆచరణ సాధ్యమా అని ఆలోచన చేయాల్సి ఉందన్నారు. నేడు అన్ని వర్గాలు ఈ నూతన విద్యా విధానాన్ని ప్రతిఘటించాల్సిన చారిత్రిక అవసరం ఉందన్నారు.
కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ఎన్ లింగమూర్తి, ప్రొ.కె.వెంకట్ నారాయణ, ఓయూ ప్రొ.కాశీం మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు నిధులు లేక, బోధన బోధనేతర నియామకాలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా యూనివర్సిటీలపై దృష్టి సారించకపోవడంతో వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. విద్యార్థులకు ఉన్నత విద్య, పరిశోధనలో ఊతమిచ్చే వ్యవస్థ లేదన్నారు. టీజాక్ చైర్మెన్ ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలోని యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకుండా నియామకాలు చేపట్టకుండా ఉన్నత విద్యావిధానాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. పైగా ప్రయివేట్ యూనివర్సిటీలకు పెద్దపీట వేస్తూ విద్యను పేద మధ్యతరగతి ప్రజలకు దూరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. కేవలం నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజులతో లక్షల రూపాయలు దండుకుంటుందని ఆరోపించారు. సమావేశంలో శివకుమార్, ఉపేందర్, వేణు, విద్యార్థులు పాల్గొన్నారు.