Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-నర్సంపేట
దళితబంధు పథకంలో ఎమ్మెల్యే, మంత్రుల జోక్యం లేకుండా అర్హులైన లబ్దిదారులకు మాత్రమే నిధులు ఇవ్వాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు డిమాండ్ చేశారు. గురువారం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ నుంచి తహసీల్ధార్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించి అనంతరం తహసీల్ధార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను అధికార పార్టీ కార్యకర్తలకు పళ్లెంలో ఫలహారంగా పంచి పెడుతూ అర్హులకు అన్యాయం చేస్తున్నదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల రాజకీయ జోక్యం వల్ల అర్హులకు దళిత బంధు పథకంలో చోటులేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం ప్రతి పథకాన్ని అధికారుల ద్వారా అమలు చేస్తే దళితబంధు మాత్రం ఎమ్మెల్యేలకు అప్పగించడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లబ్దిదారుల ఎంపికను అధికారులతో గ్రామ సభలు నిర్వహించి దరఖాస్తు పెట్టుకున్న ప్రతి దళిత కుటుంబానికి దళితబంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రగతిభవన్ ముట్టడికి వెనుకాడబోమని హెచ్చరించారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు హన్మకొండ ఆనంద్, అరూరి కుమార్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి సంఘీభావం తెలిపారు.
కేవీపీఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షకార్యదర్శులు మోలుగురి రాజు, సింగారపు బాబు, కేవీపీఎస్ నాయకులు కలకొట్ల అనిల్, విలియం కెరీ, ఏసుబాబు, వెంకన్న ఇందిర, జ్యోతి, స్వప్న, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.