Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్
- రవీంద్రభారతిలో సర్ధార్ సర్వాయి పాపన్న జయంతి
నవతెలంగాణ- కల్చరల్
సర్వాయి పాపన్న ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదనీ, బహుజనులు, బడుగు బలహీన వర్గాలను ఐక్యపరచి వారి కోసం పోరాడిన వారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన అందరి వాడని, ఐలమ్మ, దొడ్డి కొమురయ్య, కొమురం భీం, సర్దార్ పాపన్న తెలంగాణ ఆస్తి అని, వారిని ఒక కులం ప్రతినిధులుగా చూడరాదని అన్నారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్యర్యంలో సర్ధార్ సర్వాయి పాపన్న 372 జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కమలాకర్ మాట్లాడుతూ.. పాపన్న చరిత్ర కరీంనగర్లో కవులు కళాకారులు వల్ల ఎప్పటినుంచో ప్రచారంలో ఉందన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే బలహీన వర్గాల ధీరోదాత్త ప్రతినిధి పాపన్న అన్నారు. బ్రిటన్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం పరిశోధన చేసి ఆయన చరిత్ర గ్రంథస్తం చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాలకు అనేకరకాలుగా మేలు చేస్తున్నారని, గౌడ్ కులస్తులు కల్లు, నీరా అమ్ముకునేలా అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. పాపన్న జయంతిని అధికారికంగా జరిపే ఆదేశాలు జారీ చేయటం విశేషమన్నారు. త్వరలో ట్రస్ట్ ఏర్పరచి ఆత్మ గౌరవ భవన నిర్మాణం చేపడుతామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. 371 ఏండ్ల అనంతరం పాపన్న జయంతిని ప్రభుత్వం నిర్వహించడంపై కేసీఆర్‌కు బహుజనుల పట్ల అభిమానం తెలుపుతుందన్నారు. ఐక్యత ముఖ్యమని, బహుజనులు సమైక్యంగా తమను గుర్తించే వారిని ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, ఎక్సైజ్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, బీసీ కమిషన్ చైర్మెన్ డాక్టర్ కృష్ణమోహనరావు తదితరులు పాల్గొన్నారు.