Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యార్థికి టీసీ ఇచ్చేందుకు ప్రిన్సిపాల్ నిరాకరణ
- ఓ విద్యార్థి సంఘం నేత వాగ్వాదం
- వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో బెదిరించే యత్నం
- నిప్పంటుకుని విద్యార్థి నేతతోపాటు విద్యార్థికి, ప్రిన్సిపాల్, ఏవోకు తీవ్ర గాయాలు
- టీసీ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేయడంపై విద్యార్థి సంఘాల ఆగ్రహం
- చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ డిమాండ్
నవతెలంగాణ- అంబర్‌పేట/ సీటీబ్యూరో
హైదరాబాద్‌లోని రామంతాపూర్ నారాయణ కాలేజీలో దారుణం జరిగింది. శుక్రవారం ఓ విద్యార్థి టీసీ విషయంలో మాట్లాడేందుకు వెళ్లిన ఓ విద్యార్థి సంఘం నేతకు ప్రిన్సిపాల్‌కు వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బెదిరించేందుకు ప్రిన్సిపాల్ గదిలోనే పెట్రోల్ పోసుకోవడంతో.. వెనకాలే ఉన్న పూజ దీపం అంటుకుంది. దాంతో విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌తోపాటు విద్యార్థి సాయి నారాయణస్వామి, కాలేజీ ఏఓ అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అంబర్‌పేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆస్పత్రికి తరలించారు. అదనపు డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
మల్కాజ్గిరి వెంకట్‌రెడ్డినగర్‌కు చెందిన సాయి నారాయణస్వామి రామంతాపూర్‌లోని నారాయణ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి చేశాడు. అయితే, పూర్తి ఫీజు చెల్లించలేదన్న కారణంగా ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చేందుకు నిరాకరించారు. ఎన్నిసార్లు విన్నవించినా టీసీ ఇవ్వకపోవడంతో శుక్రవారం సాయి తన తండ్రి శేఖర్ విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌ను కలిసి సమస్యను వివరించారు. ఆ తర్వాత సందీప్‌ను వెంట తీసుకొని ప్రిన్సిపాల్ వద్దకు వెళ్లారు. సందీప్, సాయి ప్రిన్సిపాల్ సుధాకర్ గదిలోకి వెళ్లారు. టీసీ ఇవ్వాలని కోరారు. టీసీ ఇవ్వాలంటే డ్యూ ఉన్న రూ.16 వేల ఫీజు చెల్లించాలని ప్రిన్సిపాల్ తేల్చిచెప్పారు. ఈ క్రమంలో సందీప్, ప్రిన్సిపాల్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫీజు విషయంలో ప్రిన్సిపాల్ వెనక్కి తగ్గకపోవడంతో సంఘం నేత సందీప్ తన వెంటతీసుకొచ్చిన పెట్రోల్ పోసుకున్నాడు. అయితే, ప్రిన్సిపాల్ రూంలో అప్పటికే పూజ చేసిన దీపం సందీప్ వెనకాల ఉండటంతో క్షణాల్లో మంటలు అంటుకున్నాయి. దాంతో సందీప్‌తోపాటు సాయికి సైతం మంటలు వ్యాపించడంతో వారిని అడ్డుకునే క్రమంలో ఏవో అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోదా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడ బెడ్లు ఖాళీ లేకపోవడంతో డీఆర్డీఏ ఆస్పత్రికి తరలించారు. ప్రిన్సిపాల్, ఏఓ అశోక్‌రెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. విద్యార్థి సంఘం నాయకుడు సందీప్‌కు ఏడాది కిందటే వివాహమైనట్టు బంధువులు తెలిపారు. ఎస్ఎఫ్ఐ, సహా పలు విద్యార్థి సంఘాల నాయకులు, సందీప్ కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇదిలావుండగా, ఈ ఘటనలో ప్రిన్సిపల్ రూమ్‌లోని సామాగ్రితోపాటు ఏసీ కాలిపోయాయి. కుర్చీలు, ఇతర వస్తువులు దగ్ధమయ్యాయి. అంబర్‌పేట పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
కాలేజీకి షోకాజు నోటీసులు
నారాయణ కాలేజీ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. దాంతో కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం షోకాజు నోటీసులు జారీ చేసింది. రామంతాపూర్ నారాయణ కాలేజీ ఘటనపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ సంఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆ విద్యార్థి తమకెప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఆ కాలేజీ యాజమాన్యం చెబుతోంది.
ఇలా జరిగింది
- 12:20కి విద్యార్థి సాయి నారాయణ, విద్యార్థి నాయకుడు సందీప్‌తో పాటు మరో ఆరుగురు కాలేజీలోకి వచ్చారు.
-12:35 ప్రిన్సిపాల్ చాంబర్లోకి సాయి, సందీప్ ఇద్దరూ వెళ్లారు.
-12:40కి ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డితో సర్టిఫికెట్ విషయంలో వాగ్వివాదం జరిగింది.
- 12:43కి సందీప్ పెట్రోల్ పోసుకున్నాడు.
- 12:44కి ప్రిన్సిపాల్ రూమ్‌లో మంటలు రావడంతో ఏఓ అశోక్ ప్రిన్సిపాల్ చాంబర్లోకి పరుగెత్తాడు.
-12:45కి బయటకు పరుగు తీయడంతో అ క్కడున్న సిబ్బంది, విద్యార్థులు వెంటనే మంటలు ఆర్పారు.
- 12:50కి సందీప్, అశోక్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సుధాకర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలించారు.