Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేని గర్భిణులను ఎలా లెక్కిస్తాం
- ఆశా వర్కర్ల ఆవేదన
- ఎస్సీడీ సర్వేతో తీవ్ర ఒత్తిడి
- ఎన్నికల్లోనూ విధులు
నవతెలంగాణ- సిటీబ్యూరో
'ప్రతి నెలా కొత్తగా గర్భిణులను గుర్తించి నాలుగింటిని తప్పనిసరిగా నమోదు చేయాలి. ఒక వేళ ఆ నెలలో ఎవరూ గర్భం దాల్చకుంటే మాకు చీవాట్లు, చీత్కారాలు, రిమార్కులు తప్పవు. లేని సంఖ్యను ఎలా నమోదు చేస్తాం. అధికారులు అర్థం చేసుకుంటలేరు' అని ఆశావర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఆశా వర్కర్లను నియమించిన ఉద్దేశం 'మాతా-శిశు మరణాల నివారణ'. కానీ ఆశా వర్కర్లతో అన్ని పనులూ చేయిస్తున్నారు. మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకు అన్నీ చూసుకుంటున్న ఆశా వర్కరూ ఓ మహిళే. కానీ విధి నిర్వహణలో మహిళలకు సంబంధించిన సమస్యల గురించి పైఅధికారులకు చెబితే నానా బూతులు తిడుతూ నరకయాతన పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి నెలకొందని ఆశావర్కర్లు ఆవేదన చెందుతున్నారు.
ఒక్కో ఆశాకు 2,500 కుటుంబాలు
హైదరాబాద్ జిల్లా పరిధిలో సుమారు 50 లక్షలకుపైగా జనాభా ఉంది. 94 బస్తీ దవాఖానాలు, 50కిపైగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు 2500 కుటుంబాలకు సంబంధించిన ఆరోగ్య విషయాలను ఆశా కార్యకర్తలు ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తూ పైఅధికారులకు చేరవేస్తూ ఉండాలి. హైదరాబాద్ జిల్లా జనాభా, కుటుంబాల సంఖ్య ఆధారంగా 2500 మంది ఆశావర్కర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 1,895 మంది మాత్రమే ఉన్నారు. ఆశాల సంఖ్య తక్కువగా ఉండటంతో పని భారం పెరిగింది. రోజుకు సుమారు 14 గంటలపాటు పనులు చేయిస్తున్నారని ఆశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
లక్ష్యం తప్ప..
ఆశావర్కర్లను నియమించుకున్న అసలు పనిని పక్కనబెట్టి ఇతర పనులు చేయిస్తూ వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. వారు ప్రతి కుటుంబంలో తల్లీపిల్లల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ఆశా మాస్ డాక్టర్‌గా వ్యవహరిస్తోంది. కానీ ఎన్నికల విధులు, బూతుస్థాయి అధికారిగా, ఏమైనా జాతీయ, రాష్ట్ర స్థాయి పరీక్షలు నిర్వహిప్తే అక్కడ ట్యాబ్లెట్స్ అందించే డ్యూటీలు వేస్తున్నారు. సెలవులు కూడా ఇవ్వకుండా పనులు చేయిస్తున్నారు.
ఎస్సీడీ సర్వేతో..
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెల్త్ ప్రొఫైల్ రూపొందించడానికి నాన్ కమ్యూనికేబుల్ డిసీస్ (ఎస్సీడీ) సర్వే నిర్వహిస్తోంది. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ, ఇతర వ్యాధులకు సంబంధించిన రోగులను గుర్తించి వారికి సరైన చికిత్స అందించే ఉద్దేశంతో సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సర్వేలో ఆశావర్కర్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆశా వర్కర్ రోగి డిసీస్ ప్రొఫైల్ తయారు చేస్తే ఏఎన్ఎం స్క్రీనింగ్ చేస్తోంది. తర్వాత మందులు ఇవ్వడం, చికిత్సకు సంబంధించిన పనులు చేయాలని నిర్ణయించారు. కానీ ఈ సర్వేలో ఆధార్‌నెంబర్, మొబైల్ నెంబర్, ద్విచక్రవాహనం, నాలుగు చక్రాల వాహనం, ఇతర వివరాలను సేకరించాల్సి ఉంది. ఈ వివరాలను ఇవ్వడానికి నగరవాసులు ఆసక్తి చూపడం లేదు. అధికారులు మాత్రం తప్పనిసరిగా ఎన్సీడీ సర్వే ఫామ్‌ను పూర్తిగా నింపాలని, లేకుంటే వేతనంలో కోత విధించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
వేధిస్తున్నారు : ఆశా వర్కర్లు
సూటిపోటీ మాటలంటూ అధికారులు వేధిస్తున్నారు. ఆరోగ్య సూత్రాలను అందరికీ చెబుతున్నాం. తాము ఆరోగ్య సూత్రాలను పాటిస్తే అధికారులతో తిట్లు తినాల్సి వస్తోంది. నీరు ఎక్కువగా తీసుకోవడంతో టాయిలెట్లకు వెళ్లినా, నెలసరి సమయంలో ఇబ్బందుల గురించి చెబుతుంటే 'నువ్వు ఒక్కదానివే ఆడదానివా?' అని హేళన చేస్తున్నారు. కరోనా సమయంలో అద్దె ఇండ్లల్లో నుంచి గెంటేశారు. అధికారుల ఈసడింపులు, సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కొన్నాం.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి: శ్రామిక మహిళాకన్వీనర్ ఆర్.వాణి
ఆశా వర్కర్లకు ఎవరూ ఇండ్లు అద్దెకు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపులో ఆశాలకు తప్పనిసరిగా ఇవ్వాలి. ఆశాలను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి. జులై 2021 నుంచి పీఆర్సీ ఏరియర్స్‌ను వెంటనే చెల్లించాలి. కేంద్రం చెల్లించిన కరోనా రిస్క్ అలయెన్స్ 16నెలల బకాయిలను చెల్లించాలి. ఐదేండ్ల పెండింగ్ యూనిఫామ్స్‌ను వెంటనే ఇవ్వాలి. క్వాలీటితో కూడిన పూనమ్ క్లాత్ శారీస్ ఇవ్వాలి. పారితోషికం లేని అదనపు పనులను చేయించరాదు. జిల్లా ఆస్పత్రుల్లో రెస్ట్ రూమ్‌లను ఏర్పాటు చేయాలి. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.