Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రూ అప్ పేరుతో రూ.4,092.23 కోట్లు క్లెయిమ్ చేసిన డిస్కంలు
- 2006 నుంచి 2020-21 వరకు చెల్లించాలట!
- అయిపోయిన పెండ్లికి బాజాలు ఊదుతున్న తీరు...
- ప్రతిపాదనలు స్వీకరించిన టీఎస్ఈఆర్సీ
- సెప్టెంబర్ 8లోపు ప్రజాభిప్రాయాలు చెప్పమంటూ ప్రకటన
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
మీరు గత ఏడాది జనవరిలో రూ.10 కు టీ తాగారనుకుందాం. ఓ ఆర్నెల్లు తర్వాత టీ రేటు రూ.15కి పెరిగిందనుకోండి...ఆ పెరిగిన రూ.5 లు ఈ ఏడాదిలో ఇప్పుడు ఇమ్మంటే ఎలా ఉంటుంది? బిత్తరపోతారు...ఇదేం చోద్యం అంటారు...అంతే కదా...కానీ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడు అచ్చం ఇలాంటి సొమ్మునే విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేసుకొనేందుకు సిద్ధపడ్డాయి. దానికే ముద్దుగా 'ట్రూ అప్' చార్జీలని పేరు పెట్టాయి. సరే... అదేదో గతేడాది వ్యత్యాసమే కదా! అని కాస్తో కూస్తో సమర్థించుకుందామంటే...ఇప్పుడు డిస్కంలు అడుగుతున్న సొమ్ము 15 ఏండ్ల క్రితం నాటిది (2006-07 నుంచి 2020-21 వరకు) ... అప్పట్లో విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఆమోదించిన సొమ్ముకంటే ఎక్కువ డబ్బు పోసి కరెంటును కొన్నారట..! ఇప్పుడు ఆ వ్యత్యాసం సొమ్మును ప్రజల నుంచి వసూలు చేసుకొనేందుకు అవకాశం ఇవ్వండంటూ డిస్కంలు తాజాగా తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ)ని ఆశ్రయించాయి. ఈ ప్రతిపాదనలను ప్రాథమిక దశలోనే సుమోటోగా తిరస్కరించాల్సిన టీఎస్ఈఆర్సీ డిస్కంల విజ్ఞప్తిని స్వీకరిస్తూ, ప్రజలకు వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 8వ తేదీ లోపు రాతపూర్వకంగా చెప్పండంటూ బహిరంగ ప్రకటన ఇచ్చింది. వినడానికే విచిత్రంగా ఉన్న ఈ వ్యవహారంలో డిస్కంలు జనం నుంచి వసూలు చేసుకుంటామన్న మొత్తం సొమ్ము అక్షరాలా రూ. 4,092.23 కోట్లు. దీనిలో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2006-07 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 వరకూ ట్రూ అప్ చార్జీలుగా క్లెయిమ్ చేసిన సొమ్ము రూ.3,259 కోట్లు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) అదే కాలానికి క్లెయిమ్ చేసిన మొత్తం రూ.833.23 కోట్లు. 2006-07 అంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్న విషయం గమనార్హం. రాష్ట్ర విభజన తర్వాత ఇదే తరహాలో అక్కడి డిస్కంలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి 2014 నుంచి 2019 వరకు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాయి. వాటిని అక్కడి ఈఆర్సీ నిర్ద్వంధంగా తిరస్కరించింది. నిబంధనలకు విరుద్ధంగా మీ ఇష్టం వచ్చినట్టు ప్రతిపాదనలు పెడతామంటే కుదరదంటూ డిస్కంలకు అక్షింతలు వేసింది. కానీ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి అందుకు భిన్నంగా ఈ ప్రతిపాదనలను విచారణకు స్వీకరించడం గమనార్హం. డిస్ట్రిబ్యూషన్, రిటైల్ సప్లరు ట్రూఅప్ చార్జీలను డిస్కంలు క్లెయిమ్ చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వినియోగదారులపై రూ.5,596 కోట్ల కరెంటు చార్జీల భారాన్ని మోపిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో రూ.4,092.23 కోట్ల భారాలు మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవి అమల్లోకి వస్తే ఇప్పుడు ప్రతినెలా వస్తున్న కరెంటు బిల్లుల్లో ప్రత్యేకంగా ట్రూఅప్ చార్జి పేరుతో అదనపు వసూళ్లు చేస్తారు.
ఇష్టారాజ్యం...
రాష్ట్ర విద్యుత్‌రంగాన్ని ఉత్పత్తి, సరఫరా, పంపిణీ సంస్థలు ఇష్టారాజ్యంగా నిర్వహిస్తున్నాయి. ఎవరికీ జవాబుదారీ లేదు. మొదటి నియంత్రణ కాలంలో ఈఆర్సీ ఆమోదించిన సొమ్ముకంటే ఎక్కువ ఖర్చు అయితే పంపిణీ సంస్థలు రెండో నియంత్రణ కాలంలో క్లెయిమ్ చేసుకోవాలి. కానీ అందుకు పూర్తి భిన్నంగా నాలుగు నియంత్రణ కాలాలు పూర్తయ్యాక 2006 నుంచి 2021 వరకు పెరిగిన ఖర్చును వసూలు చేసుకుంటామంటే ప్రారంభదశలోనే ఈఆర్సీ దీన్ని తిరస్కరించాలి. విచిత్రంగా వాటిపై విచారణ పేరుతో సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరించడం ఏంటి? వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తున్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే తప్ప, ఇవి గాడినపడే పరిస్థితులు కనిపించట్లేదు.
-ఎమ్ తిమ్మారెడ్డి, విద్యుత్‌రంగ నిపుణులు