Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10 రోజులుగా పిల్లలు వస్తున్నా... బోధన కరువు
- మూల్యాంకనంలో కాంట్రాక్టు, పర్మినెంట్ అధ్యాపకులు
- గెస్ట్ లెక్చరర్లను ఇంకా నియమించని సర్కారు
- స్పాట్వాల్యుయేషన్కు తీసుకున్న వైనం
- సర్కారు జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత
- సకాలంలో పూర్తికాని సిలబస్
- నష్టపోతున్న పేద విద్యార్థులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో ఒక ప్రిన్సిపాల్, ఒక రెగ్యులర్ అధ్యాపకులు, ఒక కాంట్రాక్టు అధ్యాపకులు, 12 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఒక రెగ్యులర్, నలుగురు కాంట్రాక్టు, ఆరుగురు గెస్ట్ అధ్యాపకులున్నారు. ములుగు జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీ గోవిందరావుపేటలో రెగ్యులర్ ప్రిన్సిపాల్ మాత్రమే పనిచేస్తున్నారు. అక్కడ తొమ్మిది మంది కాంట్రాక్టు, ముగ్గురు గెస్ట్ లెక్చరర్లున్నారు. ఇలా రాష్ట్రంలో గెస్ట్ లెక్చరర్ లేని కాలేజీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఒకేషనల్ కోర్సులైతే ఎక్కువ భాగం గెస్ట్ లెక్చరర్లపైనే ఆధారపడి నడుస్తున్నాయి. జూన్ 15 నుంచి జూనియర్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెణ్నెల్లు దాటినా ఇప్పటి వరకు గెస్ట్ లెక్చరర్లను ప్రభుత్వం నియమించలేదు. ఇంకోవైపు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత ఉన్నది. సుమారు 25 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు పర్మినెంట్, కాంట్రాక్టు అధ్యాపకులు ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనంలో నిమగమయ్యారు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సర్కారు గాలికొదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి. పది రోజుల నుంచి వాటిలో తరగతులు ఖాళీగా ఉంటున్నాయి. విద్యార్థులు రోజూ తరగతులకు హాజరవుతున్నా బోధన మాత్రం సాగడం లేదు. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్, కాంట్రాక్టు అధ్యాపకులు మూల్యాంకనంలో ఉంటే, గెస్ట్ లెక్చరర్లను ఇంకా నియమించకుంటే పాఠాలు బోధించేదెవరు?అనే ప్రశ్న తలెత్తుతున్నది. అధ్యాపకుల్లేకుంటే బోధన ఎలా సాగుతుందని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.
విద్యార్థుల భవిత ఆగం
రాష్ట్రంలో 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 5,901 అధ్యాపక పోస్టులు మంజూరయ్యాయి. వాటిలో 644 మంది రెగ్యులర్ అధ్యాపకులు పనిచేస్తున్నారు. 3,599 మంది కాంట్రాక్టు అధ్యాపకులున్నారు. ఇంకా 1,658 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీల్లో గెస్ట్ లెక్చరర్ల నియమించకపోవడం వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. బోధించేందుకు అధ్యాపకుల్లేక సకాలంలో సిలబస్ పూర్తి కావడం లేదు. అది వారి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపనుంది. వారి బతుకులు ఆగమయ్యేందుకు ప్రభుత్వ చర్యలు దోహదపడుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 57 వేల మంది, ద్వితీయ సంవత్సరంలో 98 వేల మంది కలిపి 1.55 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రథమ సంవత్సరం ప్రవేశాల ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నది. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చాక ఎక్కువ మంది చేరే అవకాశమున్నది. విద్యారుగెస్ట్ లెక్చరర్ల అవసరం ఉన్నా వారిని నియమించక పోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. వారి వివరాలు పంపించాలంటూ ఉన్నత విద్యాశాఖ మెమో జారీ చేసి నెలదాటినా ఇంటర్ విద్యా కమిషనర్ స్పందించలేదని తెలిసింది. అయితే గెస్ట్ లెక్చరర్లను నియమించేందుకు ఆర్థిక శాఖ సైతం అనుమతించింది. అయినా ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే గెస్ట్ లెక్చరర్ల సేవలను మూల్యాంకనానికి వినియోగిస్తుండడం గమనార్హం. కాలేజీల్లో బోధించేందుకు వారిని నియమించలేదు కానీ జవాబు పత్రాల మూల్యాంకనం విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వారిని విధుల్లోకి తీసుకోకపోయినా ప్రవేశాల ప్రక్రియలో, పాఠాలు బోధించడంలో భాగస్వాములు అవుతున్నారు.
విద్యార్థులు నష్టపోకుండా చూడాలి : రామకృష్ణగౌడ్
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణగౌడ్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారు నష్టోపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. గెస్ట్ లెక్చరర్లను వెంటనే నియమించి సకాలంలో సిలబస్ పూర్తయ్యేలా చూడాలన్నారు.
గెస్ట్ లెక్చరర్లను వెంటనే నియమించాలి : దార్ల భాస్కర్
గెస్ట్ లెక్చరర్లను వెంటనే నియమించాలనీ, అందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే జారీ చేయాలని గెస్ట్ లెక్చరర్ల సంఘం ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ డిమాండ్ చేశారు. తమను నియమించాలంటూ ఆర్థిక, ఉన్నత విద్యాశాఖ అనుమతి ఇచ్చినా ఎందుకు జాప్యం జరుగుతున్నదని ప్రశ్నించారు. జూన్ 15 నుంచి విధుల్లోకి తీసుకుంటున్నట్టు ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేయాలని కోరారు.