Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తప్పును సవరించుకున్న కేంద్రం
- నిన్న రూ.1,380.96 కోట్లు బకాయి..
- నేడు రూ.52.85 కోట్లే..
- రాష్ట్ర విద్యుత్ సంస్థలపై ఉద్దేశ్యపూర్వకంగానే నిందలు : టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ డీ ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ఎలాంటి బాకీ లేవు. కేంద్ర విద్యుత్ సంస్థల మధ్య సయోధ్య లేని కారణంగా తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తి దారులకు రూ.1,380.96 కోట్లు బకాయి ఉన్నట్టు ప్రకటించారు. ఎక్సేంజ్ నుంచి కొనుగోళ్లు నిలిపివేస్తామని చెప్పారు. విషయం తెలియగానే ఆయా కేంద్ర విద్యుత్ సంస్థలకు అన్ని వివరాలతో మెయిల్ పెట్టాం. శుక్రవారం మధ్యాహ్నానికి ఆయా సంస్థలు తప్పుల్ని సవరించుకున్నాయి. తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు కేవలం రూ.52.85 కోట్లు మాత్రమే బకాయి ఉన్నట్టు తేల్చాయి'' అని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర విద్యుత్ సంస్థలు నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎన్ఎల్డీసీ)కి కూడా తెలిపాయని వివరించారు. 13 రాష్ట్రాల్లోని 27 విద్యుత్ పంపిణీ సంస్థలు ఉత్పత్తిదారులకు భారీగా బకాయిలు ఉండటంతో ఇండియన్ ఎనర్జీ ఎక్సేంజ్ (ఐఈఎక్స్) నుంచి కొనుగోళ్ళపై ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (పోస్కో) ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగింది. గురువారం అర్థరాత్రి నుంచి ఐఈఎక్స్ నుంచి ఆయా రాష్ట్రాలకు కొనుగోళ్లను నిలిపివేశారు. అయితే శుక్రవారం నాటికి చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మణిపూర్ రాష్ట్రాలు తమ బకాయిల్ని చెల్లించేశాయి. దీనితో ఆయా రాష్ట్రాలకు పవర్ ఎక్సేంజ్ నుంచి కొనుగోళ్లకు అనుమతి ఇచ్చారు. అయితే తెలంగాణ విద్యుత్ సంస్థలు డబ్బు చెల్లించినా, బాకీ ఉన్నట్టే చూపించడం వివాదాస్పదంగా మారింది. తాజాగా బకాయిలు రూ.52.85 కోట్లు మాత్రమే ఉన్నట్టు నిర్థారించినా, ఎక్సేంజ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లకు కేంద్రం అనుమతించలేదు. దీనిపై టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు సీరియస్‌గా స్పందించారు. ''కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎక్సేంజ్ నుంచి విద్యుత్ కొనుగోళుజరపకుండా ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల శుక్రవారం 20 మిలియన్ యూనిట్లు డ్రా చేయలేకపోయాం. రూ.1,360 కోట్లు కట్టేసినా ఇలా చేయడం చాలా బాధాకరం.'' అని అన్నారు.
సీఎం ఆరా...
ఇదే అంశంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆరా తీసారు. ప్రభాకరరావుతో మాట్లాడారు. ఆయన అన్ని విషయాలూ వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడడంతో జల విద్యుత్‌ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామనీ, శుక్రవారం రాష్ట్రంలో 12,214 మెగా వాట్ల డిమాండ్ వచ్చినా ఎక్కడా సరఫరాకు అంతరాయం ఏర్పడలేదని ఈసందర్భంగా సీఎమ్‌డీ సీఎంకు వివరించారు.