Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భం దాల్చడంతో అబార్షన్‌కు ప్రయత్నం
- వైద్యం వికటించి యువతి మృతి
నవతెలంగాణ-ములకలపల్లి
పెండ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి యువతిని నమ్మించి శారీరకంగా లొంగదీసు కున్నాడు. ఐదు నెలల గర్భవతి అయిన తర్వాత అబార్షన్ చేయించేందుకు ప్రయ త్నించగా వైద్యం వికటించి యువతి మృతిచెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వీకే రామవరంలో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీకే రామవరం గ్రామానికి చెందిన సోడి వరలక్ష్మి, రాములు దంపతుల కుమార్తె సోడె శిరీష (20) పాల్వంచలో ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఇంటి వద్ద నుంచి కళాశాలకు వెళ్లి వచ్చే శిరీషతో పూసుగూడెం పంచాయతీ పకీర్ తండా గ్రామానికి చెందిన వివాహితుడు భూక్యా నందుతో పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో దగ్గరై శారీరకంగా లొంగదీసుకోవడంతో శిరీష గర్భం దాల్చింది. దాంతో యువతికి అబార్షన్ చేయించేందుకు రెండు రోజుల కిందట భద్రాచలంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. ఈ క్రమంలో వైద్యం వికటించి ఆ యువతి మృతి చెందింది. కాగా, యువతి పరిస్థితి విషమించిందని తెలియడంతో నందు అక్కడినుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు.. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు భద్రాచలం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, నందును అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.