Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పైలట్ ప్రాజెక్టుగా అంగడి కిష్టాపూర్
- సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్
నవతెలంగాణ-మర్కుక్
గ్రామంలో నెలకొన్న ఇంటి స్థలం, గ్రామకంఠంలోని భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం అంగడికిష్టాపూర్ను పైలట్ ప్రాజెక్టు ఎంపిక చేసినట్టు సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం అంగడి కిష్టాపూర్ గ్రామంలో శుక్రవారం పంచాయతీరాజ్ కమిషనర్ హన్మంతరావుతో కలిసి ఆమె పర్యటించారు. దశాబ్ద కాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం కానున్నాయని చెప్పారు. గ్రామకంఠంలోని భూ సమస్యపై సర్పంచ్ దుద్దెడ లక్ష్మీ రాములుగౌడ్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచినందుకు ప్రధానోపాధ్యాయుడిని, సర్పంచ్ని, ఉపాధ్యాయులను సన్మానించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అంగడికిష్టాపూర్ గ్రామంలో మొత్తం 31 ఎకరాల స్థలం ఉండగా, అందులో 21 ఎకరాల స్థలంలో ఇండ్లు, ఇంటి స్థలాలు ఉన్నాయన్నారు. పది ఎకరాల్లో ప్రభుత్వ సంస్థలు, రహదారులు ఉన్నాయని చెప్పారు. డ్రోన్ ద్వారా గ్రామం మొత్తం సర్వే చేసి ముందుగా ప్రభుత్వ స్థలాలను గ్రామపంచాయతీ పేరున రిజిస్ట్రేషన్ చేయడం.. ఇండ్లు, ఖాళీ స్థలాలను వివాదాలకు తావు లేకుండా యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామంలో సర్వే చేసేటప్పుడు ప్రజలు వారి ఇంటికి, స్థలాలకు సంబంధించి గతంలో ఉన్న పత్రాలను అధికారులకు చూపించి సహకరించాలని సూచించారు. వారి వెంట సిద్దిపేట, మెదక్ కలెక్టర్లు ప్రశాంత్ జీవన్ పాటిల్, హరీశ్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మెన్ ప్రతాప్ రెడ్డి, ఆర్డీవో విజయేందర్ రెడ్డి, ఎంపీపీ పాండుగౌడ్, జడ్పీటీసీ యెంబరి మంగమ్మ రాంచంద్రం యాదవ్, ఎంపీడివో ప్రవీణ్, తహసీల్దారు అహ్మద్ ఖాన్, ఎంపీటీసి గోలి నరేందర్, ఉపసర్పంచ్ కొండల్ రెడ్డి, తదితరులున్నారు.