Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిప్లమాట్ ఔట్ రీచ్ ప్రోగ్రాంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రమని, పారదర్శక విధానాలతో ఆకట్టుకుంటున్నా మని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని టీ-హబ్ 2.0లో మంత్రి నిర్వహించిన డిప్లమాట్ ఔట్ రీచ్ కార్యక్రమానికి 50 దేశాలకు చెందిన రాయబారులు, డిప్లమాట్స్, కాన్సుల్ జనరల్స్, గౌరవ కాన్సుల్ జనరల్స్, హై కమిషనర్లు, ట్రేడ్ కమిషనర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దేశంలోనే అత్యుత్తమ విధానంతో ఎనిమిదేండ్లుగా రాష్ట్రం పలు ప్రముఖ కంపెనీలకు గమ్యస్థానంగా మారిందని చెప్పారు. సమాచార సాంకేతికత, జీవశాస్త్రాలు, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు విజయవంతంగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని వివరించారు. తెలంగాణ పెట్టుబడుల సలహాదారు పేరుతో రూపొందించిన వర్చువల్ మస్కట్, చాట్ బొట్ను ఈ సందర్భంగా కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం పలు దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ అంశాలపైన తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఆ తరువాత దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు టీ హబ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న వివిధ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో సంభాషించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్, టీ వర్క్స్, టీఎస్ఐసీ, టాస్క్ సంస్థల లక్ష్యాలు, పనితీరును దౌత్యవేత్తలు ప్రశంసించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, టీ హబ్ సీఈఓ ఎం.శ్రీనివాస్ రావు, పరిశ్రమల శాఖ, ఐటీ శాఖకు చెందిన వివిధ విభాగాల డైరెక్టర్లు, పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
కర్మ సిద్ధాంతం ప్రకారం...
- చేసింది తిరిగి అనుభవించాల్సిందే
గుజరాత్లో 2002లో చోటుచేసుకున్న బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను అక్కడి ప్రభుత్వం విడుదల చేయడంపై మంత్రి కేటీఆర్ భాజపాపై విమర్శలు గుప్పించారు. ఒమిషన్, కమిషన్, రెమిషన్ లాంటి చర్యలను మరిచిపోలేమని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ అంశంపై ట్విటర్లో స్పందించిన కేటీఆర్.. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు అభివృద్ధి, భద్రత, సంక్షేమంపై ఎన్నో హామీలు చూశామన్నారు. అయితే, ఇప్పుడు రేపిస్టులు, గర్భిణిలు, చిన్నారులను హత్య చేసిన వారిని విడుదల చేస్తున్నారని ఎద్దేవా చేశా రు. ఇలాంటి ఖైదీల విడుదల, శిక్ష తగ్గింపు ఎప్పటికీ మరిచిపోలేమన్న ఆయన... కర్మ సిద్ధాంతం ప్రకారం చేసింది తిరిగి అనుభవించాల్సిందేనని గుర్తు చేశారు.