Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని రహదారులపై ఏర్పడిన బ్లాక్స్పాట్ల తొలగింపుకు రోడ్లు, భవనాల శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లపై 463 బ్లాక్స్పాట్లు ఉన్నాయి. వీటిలో 297 బ్లాక్స్పాట్లను గత రెండేండ్లకాలంలో తొలగించారు. మిగతా 166 బ్లాక్స్పాట్లను పూర్త్తిగా మరమ్మత్తు చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. ఒక్కో బ్లాక్‌స్పాట్‌ను గుర్తించి, తొలగించేందుకు ఆర్ అండ్ బీ, రవాణా, వైద్య, పోలీసు, విద్యా శాఖలు కలిసి సమన్వయంతో చర్యలు చేపడుతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా మిగతా బ్లాక్స్పాట్లను సైతం వేగంగా తొలగించేందుకు ఆర్అండ్బీ శాఖ చర్యలు తీసుకుంటున్నది.
రహదారులు.. బ్లాక్స్పాట్లు
రాష్ట్రంలో ఆర్అండ్బీ పరిధిలో మొత్తం 27,461 కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులున్నాయి. అందులో రాష్ట్ర రహదారులు మొత్తం 1,727 కిలోమీటర్లు, జిల్లా ప్రధాన రహదారులు 11, 371 కిలోమీటర్లు, ఇతర గ్రామీణ రోడ్లు 14, 363 కిలోమీటర్ల వరకూ ఉన్నాయి. ఈ రహదారులు సైతం రెండు రకాలు. వాటిలో ప్రధానంగా రాష్ట్ర రహదారుల వెంట ఉన్నవాటిపై 256 బ్లాక్స్పాట్లు గుర్తించగా, ఇప్పటికే 133 తొలగించారు. మరో 123 స్పాట్లను తొలగించే పనినడుస్తున్నది. పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం( పీపీపీ )లోని రోడ్లపై 207 బ్లాక్స్పాట్లను గుర్తించి, 164కు మరమ్మత్తులు చేశారు. 43 బ్లాక్స్పాట్లను తొలగించాల్సి ఉంది.
బ్లాక్‌స్పాట్ అంటే..
కేంద్ర ఉపరితల, రోడ్డు రవాణా శాఖ మార్గదర్శకాల ప్రకారం ఏదైనా రాష్ట్ర రహదారి, జిల్లా ప్రధాన రోడ్డు లేదా జాతీయ రహదారిపై 500 మీటర్ల పరిధిలో మూడేండ్లల్లో పది అతి పెద్ద ప్రమాదాలు జరిగితే.. ఆ ప్రాంతాన్ని బ్లాక్‌స్పాట్‌గా గుర్తిస్తారు. ఈ బ్లాక్స్పాట్ల స్థాయిని బట్టి అక్కడ ప్రమాదాల నివారణకు రోడ్లు, భవనాలు, రవాణా, వైద్యం, విద్యాశాఖలు సంయుక్త ప్రణాళికను రూపొందించి అమలుచేస్తాయి.
తొలగింపు చర్యలు
సాధారణంగా బ్లాక్స్పాట్ల తొలగింపు అనేది ఒక నిరంతర ప్రక్రియని రోడ్లు, భవనాల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వాటిని గుర్తించిన తర్వాత రోడ్డు డిజైన్ చేసే క్రమంలో ఏమైనా ఇంజినీరింగ్ ప్రణాళికలో లోపాలు ఉన్నాయా అన్న విషయాన్ని పరిశీలించి నిర్థారిస్తారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే, దాన్ని వెంటనే పరిష్కరిస్తారు. బ్లాక్‌స్పాట్ సమీప ప్రాంతాల్లో వాహనదారులను హెచ్చరిస్తూ రవాణా శాఖ ప్రత్యేక సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తుంది. దీంతోపాటు, అవసరమైన చోట గ్రేడ్ సెపరేటర్ల్ నిర్మాణం, రోడ్లు వెడెల్పు తదితర పనులు చేస్తారు.