Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిహారపు డబ్బులు అడిగినందుకు రెండేండ్లుగా సర్పంచ్ వేధింపులు
- భర్త ఎదుటే పలుమార్లు అఘాయిత్యం
- బాధితురాలి వెల్లడి.. బంధువుల సహాయంతో విముక్తి
- నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలో ఘటన
- కేసు దర్యాప్తు చేస్తున్నాం : నాగర్‌కర్నూల్ సీఐ హనుమంతు నాయక్
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
''మాకు వచ్చిన భూ పరిహారం డబ్బును గ్రామ సర్పంచ్ శ్రీశైలం, ఆయన తండ్రి బాలస్వామి దాదాపు రూ.18 లక్షలు తీసుకున్నారు. అడిగితే బెదిరించారు.. సర్పంచ్ నాపై రెండేండ్లుగా లైంగికదాడి చేశాడు. మాట వినకుంటే నన్ను, నా భర్తను చంపేస్తామని బెదిరించారు. చితకబాది చిత్ర హింసలకు గురిచేశారు. విషయాన్ని పోలీసులకు వివరించి తమకు న్యాయం చేయాలని కోరినా పట్టించుకోలేదు. వారు పెట్టే చిత్రహింసలు భరించలేక నా భర్త హైదరాబాద్ వెళ్లి తలదాచుకున్నాడు. నన్ను ఇంట్లో నిర్బంధించి లైంగికదాడి చేశాడు. మా బంధువులు రాకుంటే నేను చనిపోయేదాన్ని.. అది తలచుకుంటేనే భయమేస్తోంది'' అని కారుకొండ గ్రామానికి చెందిన బాధితురాలు గౌరమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలో శనివారం వెలుగులోకొచ్చింది. వీటికి సంబంధించి బాధితులు, బాధితుల బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నామని నాగర్‌కర్నూల్ సీఐ హనుమంతు నాయక్ తెలిపారు.
నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన మిద్దె వెంకట్రాములు గౌరమ్మ దంపతులకు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఐదెకరాలు మునకకు గురైంది. ప్రభుత్వం పరిహారంగా బాధిత రైతుకు రూ.22లక్షలు ఇచ్చింది. వారి అమాకత్వాన్ని అధికార పార్టీ సర్పంచ్ మిద్దె శ్రీశైలం, తండ్రి బాలస్వామి సొమ్ము చేసుకున్నారు. భూములు, ఇండ్లు కొనిస్తామని చెప్పి వారి నుంచి డబ్బులు తీసుకున్నారు. వీటితోపాటు ఒక ట్రాక్టరును కొనుగోలు చేయించి వారి వద్దే ఉంచుకున్నారు. మూడేండ్లైనా డబ్బులివ్వలేదు. భూమి కొనుగోలు చేయలేదు. దీంతో బాధిత రైతు వెంకట్రాములు, ఆయన బార్య గౌరమ్మ కలిసి డబ్బులివ్వాలని సర్పంచ్‌పై ఒత్తడి చేశారు. దాంతో కక్షగట్టిన సర్పంచ్, ఆయన తండ్రి, మరో ఆరుగురు అన్నదమ్ములు కలిసి వారిని భయపెట్టి ఎలాగైనా డబ్బులు ఎగ్గొట్టేలా చేయాలనుకున్నారు. అందులో భాగంగానే గౌరమ్మను పలుమార్లు చిత్రహింసలకు గురిచేశారు. భర్త కండ్ల ఎదుటే పలుమార్లు గౌరమ్మపై బాలస్వామి లైంగిక దాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి భర్తను దారుణంగా చితక బాదారు. ఆ తర్వాత దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. చివరికి సర్పంచ్, అతని కుటుంబీకుల చిత్రహింసలు తట్టుకోలేని రైతు వెంకట్రాములు హైదరాబాద్‌కు వెళ్లి బందువుల ఇంట్లో తలదాచుకున్నాడు. దీంతో సర్పంచ్ బాధితు రాలిని అక్కడి నుంచి మండల కేంద్రమైన బిజినే పల్లిలో మూడు నెలలుగా నిర్బంధించి లైంగికదాడి చేశాడు. చుట్టుపక్కల వారికి చెబితే చంపేస్తానంటూ భయపెట్టడంతో ఆమె గదిలోనే ఉండిపోయింది. అయితే, బాధితుడు వెంకట్రాములు ఈ విషయాలను బంధువులకు చెప్పాడు. దాంతో బంధువులు పోలీసులను ఆశ్రయించారు. చివరకు పోలీసుల సాయంతో బాధితురాలిని సర్పంచ్ చెర నుంచి విడిపించారు. బాధితురాలితో పాటు బంధువులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ఐద్వా జిల్లా కార్యదర్శి కందికొండ గీత, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు అంతటి కాశన్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గౌరమ్మను చిత్రహింసలకు గురిచేసి రెండేండ్లుగా లైంగికదాడి చేసిన సర్పంచ్ శ్రీశైలం, ఆయన తండ్రి బాలస్వామిని కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పదవులు, రాజకీయ పలుకుబడి ఉండటంతో ఇష్టాను సారంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయంలో పోలీసులు కూడా ఉదాసీనతను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. తీసుకున్న డబ్బులు అడిగితే రైతు భార్యను నిర్బంధించి లైంగికదాడి చేయడం దారుణమని, వెంటనే నిందితులను అరెస్టు చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కేసు దర్యాప్తు చేస్తున్నాం
బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామానికి చెందిన గౌరమ్మ, వెంకట్రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు బాలస్వామి, శ్రీశైలంపై కేసులు నమోదు చేశాం. లైంగికదాడితో పాటు చీటింగ్ కేసులు నమోదు చేశాం. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపాం. అక్కడి నుంచి రిపోర్టు రాగానే నిందితులను అరెస్టు చేసి కేసు దర్యాప్తును వేగవంతం చేస్తాం.
- సీఐ హనుమంతు నాయక్, నాగర్‌కర్నూల్
మతిస్థిమితం లేని బాలికపై లైంగికదాడి
- ప్రశ్నించిన తల్లిపై దాడి
నవతెలంగాణ-పెద్దవూర
మతిస్థిమితం లేని బాలికపై 57ఏండ్ల వ్యక్తి లైంగికదాడికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం కటికర్లగూడెంలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబంలో అందరూ వికలాంగులే.. తల్లి భిక్షాటన చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. ఎస్ఐ పరమేష్ తెలిపిన వివరాల ప్రకారం.. కటికర్లగూడెం గ్రామానికి చెందిన మానసిక, శారీరక వికలాంగురాలైన 12ఏండ్ల బాలికపై ఈనెల 13న అదే గ్రామానికి చెందిన 57ఏండ్ల కటికర్ల వెంకటయ్య లైంగికదాడి చేశాడు. గ్రామంలో కొంత పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో ఈ విషయం వెంటనే బయటకు రాలేదు. బాధితురాలి తల్లి పశ్నిస్తే ఆమెపై దాడి చేసి గాయపర్చాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలికను జిల్లా కేంద్రంలోని భరోసా సెంటర్‌కు తరలించారు. బాధితురాలి తల్లి, తండ్రి, అన్న కూడా వికలాంగులే. తల్లి ఇంటింటికీ వెళ్లి భిక్షాటన చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది.