Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'ఉపాధి' చట్టంలో కేంద్రం కొత్త రూల్స్
- గ్రామాల్లో కొత్త పనుల అనుమతి ఇక క్లిష్టతరం
- 75 నుంచి 20 పనులకు కుదింపు...
- కూలీలు, సిబ్బందిపై పెరగనున్న ఒత్తిడి
- ఏటేటా ఎన్ఆర్ఈజీఎస్కు తగ్గుతున్న బడ్జెట్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక అల్లాడుతున్న నిరుపేదల కోసం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే పనిలో కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది. చట్టంలో కొత్త నిబంధనలతో ఉపాధి హామీ పనుల నిర్వహణ క్లిష్టతరంగా మారనుంది. ఒక్కో పంచాయతీలో ఏకకాలంలో గతంలో 75 పనుల వరకూ చేసేందుకు అనుమతి ఉండేది. ఇప్పుడు దాన్ని 20 పనులకే పరిమితి చేసింది. అదీ ఒక పని పూర్తయిన తర్వాతే మరో పని చేపట్టాల్సి ఉంటుంది. దాంతో ఉపాధి హామీ పనులు దొరకడం కష్టమేననే అభిప్రాయం కూలీలు, సిబ్బంది నుంచి వ్యక్తమవుతోంది. ఉపాధిహామీ పనుల నిర్వహణ, పర్యవేక్షణ ఎన్ఆర్ఈజీఎస్ సాఫ్ట్వేర్ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పనులు, కూలీల మస్టర్లు వివరాలన్నీ కూడా ఈ సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. దాని ప్రకారమే బిల్లుల చెల్లింపు చేస్తారు. ఈ రూల్ మూలంగా బిల్లులు చేయడం కూడా కష్టతరమవుతుందని గ్రామీణాభివృద్ధిశాఖ సిబ్బంది చెబుతున్నారు. ఎన్ఆర్ఈజీఎస్ను నీరుగార్చుతూ.. చివరకు ఎత్తివేయాలనే కుట్రతోనే కేంద్రం ఇలాంటి నిబంధనలు తీసుకొస్తోందని వ్యవసాయ కార్మికసంఘం నేతలు ఆరోపిస్తున్నారు.
20 పనులకే బిల్లులు...
కొత్త నిబంధనల ప్రకారం ఒక్కో పంచాయతీలో 20 పనులకే బిల్లులు చేయాలని కొత్త నిబంధన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి చట్టానికి బడ్జెట్లో నిధులు కేటాయించడం తగ్గింది. 2020-21 బడ్జెట్లో రూ.1,550 కోట్లకు పైగా కేటాయిస్తే 2021-22 నాటికి రూ.1,425 కోట్లకు తగ్గింది. 2022-23 బడ్జెట్లో కేవలం రూ.1000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. దారివల్ల ఇప్పటికే పనులు చేసినా బిల్లులు రాని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడున్న పనులనూ తగ్గించేయడంతో కూలీలు, సిబ్బంది ఉపాధికే ఎసరు వచ్చింది. పాత విధానం ప్రకారం ప్రతి జిల్లాలో సుమారు 75 పనులు చేపడుతున్నారు. ఇక నుంచి వీటిని 20కే పరిమితం చేయాల్సి వస్తుందంటున్నారు. అయితే ఇప్పటికే మంజూరైన పనులకు మాత్రం కొత్త నిబంధన వర్తించకపోవచ్చని భావిస్తున్నారు. కొత్తగా మంజూరు చేసే పనులకే ఈ నిబంధన వర్తిస్తుందంటున్నారు. పనులను కుదించడం మూలంగా ఆశించిన మేరకు పనిదినాలు లభించకపోవచ్చని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ పనులు గడువులోగా పూర్తి చేయడం కోసం కేంద్రం ఈ నిబంధన తీసుకొచ్చిందని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో కూలీలు, సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతుందని వ్యవసాయ కార్మిక సంఘం నేతలు అంటున్నారు.
ఏటేటా పడిపోతున్న పనిదినాలు..
ఇప్పటికే ఏటేటా పనిదినాలు పడిపోతుండటంతో జాబ్ కార్డులున్న అనేక మంది కూలీలు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారుతున్నారు. బిల్డింగ్ వర్క్‌లు, మట్టి పనులు వంటివి నిర్వహిస్తున్నారు. రోజుకు రూ.650 కూలీ లభిస్తే దానిలో రూ.50 నుంచి రూ.100 పనిచూపించిన దళారులే కాజేస్తున్నారని వాపోతున్నారు. తండ్రి కొడుకులున్న కుటుంబాలలో పెళ్లై పిల్లలు వేరుపడితే.. పిల్లలకు జాబ్‌కార్డు ఇస్తే.. తల్లిదండ్రుల కార్డును రద్దు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2.31 లక్షల మందికి జాబ్‌కార్డులుండగా 5.05 లక్షల మంది కూలీలుగా పేర్లు నమోదు చేసుకున్నారు.
ఈ ఏడాది 65.61 లక్షల పనిదినాలు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకూ 40.33 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. కేవలం 641 కుటుంబాలు మాత్రమే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్నాయి. 28,127 ఉపాధి పనులకు గాను కేవలం 5,831 మాత్రమే పూర్తవడం గమనార్హం.
మొక్కల పోషణకు చెక్...
కొత్త రూల్ ప్రకారం మొక్కల పెంపకం వంటి పనులు నిర్వహించడం కుదరదు. ఇప్పటి వరకు చేపడుతున్న పనుల్లో రాష్ట్రంలో ప్రధానంగా హరితహారం పనులే ఉపాధి హామీలో ఎక్కువగా ఉంటున్నాయి. గ్రామ పంచాయతీల పరిధిలో ప్రస్తుతం 75 పనులు నిర్వహిస్తున్నారు. వీటిలో మొక్కలు నాటడం, చెరువుల్లో పూడికతీత, పంట కాల్వల శుభ్రం, పొలాలు చదును, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీల నిర్వహణ, పంట కల్లాలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, పంట పొలాలకు మట్టిరోడ్లు, చేపల చెరువుల నిర్మాణం, పెన్సింగ్ ఏర్పాటు... వంటి పనులు నిర్వహిస్తున్నారు. కానీ నూతన నిబంధన ప్రకారం ఒక పని పూర్తయితేనే మరో పని చేయాల్సి ఉంటుంది. మొక్కల పెంపకానికి ఇది వర్తించదు.
'ఉపాధి'ని నీరుగార్చాలనే కుట్రతోనే...
ఉపాధిహామీ చట్టాన్ని నీరుగార్చి.. క్రమేణా ఎత్తివేయాలనే కుట్రలో భాగంగానే కేంద్రం ఇలాంటి నిబంధనలు తీసుకొచ్చింది. ఏటేటా ఈ చట్టానికి కేటాయింపులు తగ్గిస్తూ వస్తోంది. కేటాయించిన బడ్జెట్లోనూ 20శాతం వరకూ పాత అప్పులకే చెల్లిస్తున్నారు. ఈ కొత్త నిబంధనలను వెనక్కు తీసుకోకపోతే వ్యకాస ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తాం.
- పొన్నం వెంకటేశ్వర్లు, వ్యవసాయ కార్మిక సంఘం, ఖమ్మం జిల్లా కార్యదర్శి