Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బావికాడ మీటర్లు పెట్టనివ్వ
- ఈడీ..బోడీలకు భయపడను
- మునుగోడు నుంచే ప్రగతిశీల శక్తుల ఏకం
- సీపీఐ, సీపీఐ(ఎం), ప్రగతిశీల శక్తులతో కలిసి సమస్యలపై పోరాటం
- ఉప ఎన్నిక కాదు.. రైతుల బతుకుదెరువు ఎన్నిక
- నేను బతికున్నంత వరకు ఏ పథకమూ ఆగదు
- మునుగోడు సభలో సీఎం కేసీఆర్
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రజల దీవెన ఉన్నంత వరకూ తెలంగాణ రైతుల బాయిల కాడ మీటర్లు పెట్టనివ్వనని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజాదీవెన సభలో సీఎం ప్రసంగించారు. 'మునుగోడు ఉప ఎన్నిక రాజకీయ పార్టీల ఎన్నికకాదు. రైతు బతుకుదెరువు ఎన్నిక' అని సీఎం అన్నారు. 'ఈ డూప్లికేట్ అవసరం లేని ఉప ఎన్నికలు తెచ్చే గోల్మాల్గాళ్ల నుంచి మనన్ని మనం కాపాడుకోవాలంటే మన బాయికాడ, బోరుకాడ బీజేపీ మీటర్ పెట్టుడు కాదు.. అందరం ఒక్కటై బీజేపీకే మోటార్ పెట్టాలే. మన పీడపోతదని మనవి చేస్తున్నా' అని అన్నారు. పెడుదామా బీజేపీకి మీటరు?.. పక్కా మాటేనా?..' అని సీఎం కేసీఆర్ అనగా.. పెడుదాం అంటూ జనం నినదించారు. 'కొందరు మనదాంటో సన్నాసులు ఉంటరు.. కొందరు మందుపెట్టి దూది పెట్టగానే దాని వెంబడిపోతరు. బీజేపీ టక్కు టమారాలు చూసీ మోసపోవద్దు..దానికి ఆశపడద్దు.' అని హెచ్చరించారు. దేశంలోని పేదలు, రైతుల బతుకులు బాగుపడే వరకూ దేశంలోని సీపీఐ, సీపీఐ(ఎం), టీఆర్ఎస్ వంటి ప్రగతిశీల శక్తులన్నీ కలిసి పోరాడతాయని మాటిస్తున్నానని అన్నారు. 'మోడీ నువ్వు నన్ను గోకినా.. గోకకపోయినా నేను గోకి తీరుతాను' అన్నారు. దేశంలో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అహంకారం, అధికారంతో ఏం చేసినా చెల్లుతుందనే భావనతో ఉన్నారన్నారు. వ్యవసాయ బావులకు మీటర్లు బిగించమని ఒత్తిడి తెచ్చిండని, అయినా తాను ఒప్పుకోలేదని అన్నారు. తాను బతికున్నంత వరకు ఏ సంక్షేమ పథకమూ బంద్ కానివ్వని చెప్పారు. ఈడీ, బోడీల పేరుతో భయపెట్టిస్తే తాను భయపడేది లేదన్నారు.
'కేంద్ర ప్రజావ్యతిరేక విధానాలపై, నిర్లక్ష్యంపై ఎప్పటికప్పుడూ కొట్లాడుతున్నామన్నారు. ఆ క్రమంలోనే ఐదారు నెలలుగా కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు చేస్తున్నానని, దాని ఫలితంగానే సీపీఐ తమకు మద్దతు ఇవ్వడంపై ధన్యవాదాలు తెలిపారు. తొందరలోనే సీపీఐ(ఎం) కూడా తమతో కలిసొస్తుందని' అని ఆశాభావం వ్యక్తం చేశారు. 'మునుగోడు నుంచి ఢిల్లీ వరకూ ఈ ఐక్యత కొనసాగాలి.' అని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక ఎందుకోసం వస్తుంది.. ఎవరికోసం వస్తుందో ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలని కోరారు. కృష్ణా జలాల్లో 'మా వాటా మాకివ్వని' అమిత్‌షా ఎందుకు మునుగోడు వస్తుండో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శివన్నగూడెం ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని రాజ్‌గోపాల్‌రెడ్డి కేంద్ర మంత్రులతో ఢిల్లీకి వెళ్లి అడగాలని డిమాండ్ చేశారు.
దేశంలో మోడీ ప్రభుత్వం చేసిన ఒక గొప్ప పనేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో రూ.600 పింఛన్ ఇస్తే.. ఇక్కడ రూ.2వేలు ఇస్తున్నట్టు తెలిపారు. మునుగోడు ప్రజలు బీజేపీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఫ్లోరైడ్‌తో అరిగోస పడుతుంటే నాడు దుశ్చర్ల సత్యనారాణ జలసాధన సమితి పేరుతో ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ బాధితుడు అంశుల స్వామిని ఆనాటి ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టినా పరిష్కారం చూపలేదన్నారు. మునుగోడు ప్రాంతం మనుషులు నివసించడానికి అనువుగా లేదని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. అయితే, తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ భగీరథ నీటిని పంపిణీ చేసి ఫ్లోరైడ్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలో కమ్యూనిస్టులు ఐదుసార్లు విజయం సాధించారని, బీజేపీకి ఏనాడూ డిపాజిట్ దక్కలేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో కూడా అలాంటి తీర్పునే ఇవ్వాలని, ఒకవేళ బీజేపీకి ఓట్లేస్తే బావులకు మీటర్లు రావడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ఉప ఎన్నికల్లో దెబ్బ కొడితే బీజేపీ దిమ్మతిరిగి నషాళానికి అంటాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటేసే ముందు వ్యవసాయ బావి వద్ద మోటారుకు, ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు దండం పెట్టి ఓటెయ్యాలని సూచించారు. ఒక కాంగ్రెస్‌కు ఓటేస్తే కనగల్ వాగులో వేసినట్టేనని, దాంతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదని అన్నారు. తెలంగాణ గడ్డపై బీజేపీ అడుగుపెడితే వినాశనమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. మునుగోడు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని మాట్లాడారు. ఇక్కడ అభివృద్ధి జరుగాలనే తాము పోటీలో ఉండడం లేదని, మునుగోడు ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థినే గెలిపించాల్సి ఉందన్నారు. సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇందు కోసం పని చేస్తారన్నారు. విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో డిప్యూటీ సీఎం మహామ్మూద్ ఆలీ, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మెన్లు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.