Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నరేంద్ర ధబోల్కర్ స్ఫూర్తిగా ఉద్యమిద్దాం
- జన విజ్ఞాన వేదిక సమావేశంలో నాయకులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మూఢ నమ్మకాల నిరోధక చట్ట సాధనకు ఐక్యంగా పోరాడుతామని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ప్రకటించారు. సైన్సు సమాజాన్ని పురోగమన దిశలో తీసుకెళ్తుంటే మూఢ నమ్మకాలు తిరోగమన బాట పట్టిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా పోరాడిన డాక్టర్ నరేంద్ర ధబోల్కర్ వర్థంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 20న జాతీయ శాస్త్రీయ దక్పథ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మూఢ నమ్మకాల నిరోధక చట్టాన్ని రూపొందించాలనే అంశంపై జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కోయ వెంకటేశ్వర్ రావు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ఇందిరాశోభన్, సీపీఐ (ఎం) సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి , సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా కార్యదర్శి ఎం.హన్మేశ్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమెక్రసీ) నేత కె.గోవర్థన్‌తో పాటు పలు విద్యార్థి, యువజన, డాక్టర్ల, జర్నలిస్టుల, శాస్త్రవేత్తల ప్రతినిధులు హాజరై పోరాటానికి మద్ధతు ప్రకటించారు.
పాలకుల తప్పులను ప్రశ్నించకూడదనే....
తమ తప్పులను ప్రజలు ప్రశ్నించకూడదనే పాలకులు మూఢ నమ్మకాలను పెంచి పోషిస్తున్నారని సారంపల్లి మల్లారెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. అవసరానికి మించి ఉత్పత్తులు పెరిగి మిగులు ఏర్పడిన సమయంలో వాటిని మార్కెట్ చేసుకునేందుకు కార్పొరేట్లు మూఢ నమ్మకాలను పెంచుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాస్తికత్వానికి ప్రతీకగా నిలిచిన వ్యక్తులను సైతం దేవుళ్లను చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధుడు నాస్తికత్వాన్ని బోధిస్తే ఆయన్ని దేవున్ని చేశారనీ, మహాత్మాగాంధీ ఎప్పుడైనా తనకు దైవత్వం ఉందని చెప్పారా? అంటూ ప్రశ్నించారు. మూఢ నమ్మకాల నిరోధక చట్టం కోసం పాలకులపై పెద్ద పోరాటం చేయాల్సి ఉంటుందని తెలిపారు. చట్టసాధనతో పాటు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. ఇందిరాశోభన్ మాట్లాడుతూ చట్టసాధన పోరాటంలో తమ పార్టీ వెంట ఉంటుందని తెలిపారు. పాలకుల వ్యక్తిగత విశ్వాసాల కోసం ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. అభ్యుదయ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాపోలు సుదర్శన్ మాట్లాడుతూ ఒకే తరగతిలో తెలుగు టీచర్ చెబుతున్న దానికి, సైన్సు టీచర్ చెబుతున్న విషయం భిన్నంగా ఉంటే ఆ విద్యార్థి ఎవరు చెప్పేది నమ్మాలంటూ ప్రశ్నించారు. సూర్యుని చుట్టు భూమి తిరుగుతున్నదని సైన్సు టీచర్ చెబితే, సూర్యుడు రథాలపై అంటూ తెలుగు ఉపాధ్యాయులు బోధిస్తే విద్యార్థికి ఎలాంటి ప్రయోజనమూ ఉండబోదన్నారు. ప్రజల పన్నులతో మూఢ నమ్మకాలను పెంచే కార్యక్రమాలను పాలకులు చేయడం తగదని హితవు పలికారు. ఎం.హన్మేష్ మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ప్రజలు ప్రశ్నించకూడదని కోరుకుంటున్నారని విమర్శించారు. ప్రశ్న నుంచే విజ్ఞానం విస్తరించిందనీ, అసలు ప్రశ్నే వద్దంటే విజ్ఞానం ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్ వర్క్ కన్వీనర్ సోమ మర్ల మాట్లాడుతూ ప్రజల్లో శాస్త్రీయ థక్పథం పెంచే కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. సైన్సును దిగుమతి చేసుకునేందుకు వీలున్నప్పటికీ శాస్త్రీయ దక్పథాన్ని చేసుకోలేమని స్పష్టం చేశారు. ప్రముఖ మ్యాజిషియన్ సామల వేణు మాట్లాడుతూ త్వరలో సీఎస్, శాసనసభ కార్యదర్శి, డీజీపీతో త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశం తర్వాత రాబోయే అసెంబ్లీ సమావేశంలో మూఢ నమ్మకాల నిరోధక చట్టం వస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సీపీఐ-ఎంఎల్ (న్యూడెమోక్రసీ) నేత కె.గోవర్థన్ మాట్లాడుతూ మూఢ నమ్మకాల నిరోధక చట్ట సాధన అంత సులభం కాదనీ, కలిసికట్టుగా బలమైన పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. కోవిడ్-19 నుంచి ఏ మతం ప్రజలను కాపాడలేదనీ, సైన్సు మాత్రమే కాపాడిందన్నారు. ఈ సమావేశంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.శ్రీనాథ్, కోశాధికారి ఆర్.వరప్రసాద్, తెలంగాణ సాహితి రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఉపాధ్యక్షులు కె.పార్థసారథి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఎం.సంపత్ రావు, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, దేవాంశీ గంగాజీ (బ్రేక్ త్రూ సైన్స్ సొసైటీ), సీసీఎంబీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ వి.రాధ, శాస్త్రవేత్త పి.విక్రమ్ కుమార్, డీవైఎప్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.వెంకటేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కె.ఎస్.ప్రదీప్, పీడీఎస్ యూ రాష్ట్ర కార్యదర్శి పి.మహేశ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.