Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జింబాబ్వేపై భారత్ అలవోక విజయం. మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్ వశం. వరుసగా రెండో మ్యాచ్‌లో బౌలర్ల విజృంభణ కొనసాగగా.. బ్యాటింగ్ లైనప్ షో కాస్త జోరు తగ్గింది!. శార్దుల్ ఠాకూర్ మూడు వికెట్ల ప్రదర్శన జింబాబ్వే బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేయగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత్ సులువుగానే ఛేదించింది. 2-0తో వన్డే సిరీస్ టీమ్ ఇండియా సొంతమైంది.
- 2-0తో వన్డే సిరీస్ భారత్ వశం
- ఛేదనలో సంజు మెరుపులు
- శార్దుల్ ఠాకూర్ తీన్మార్ షో
- పూర్తిగా తేలిపోయిన జింబాబ్వే
నవతెలంగాణ-హరారే
సంజు శాంసన్ (43 నాటౌట్, 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు. వికెట్ల వెనకాల మూడు మెరుపు క్యాచులు అందుకున్న సంజు శాంసన్.. ఛేదనలో చెలరేగాడు. సంజు శాంసన్ మెరుపు షోతో రెండో వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మరో మ్యాచ్ ఉండగానే వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే మరోసారి చేతులెత్తేసింది. శార్దుల్ ఠాకూర్ పేస్ విజృంభణ ముందు తేలిపోయింది. 38.1 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. సీన్ విలియమ్స్ (42), రియాన్ బర్ల్ (39 నాటౌట్) ఆతిథ్య జట్టుకు గౌరవప్రద స్కోరు అందించారు. సంజు శాంసన్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్‌లో నామమాత్రపు మూడో వన్డే సోమవారం జరుగనుంది.
సంజు షో : తొలి వన్డేలో 190 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఛేదించిన టీమ్ ఇండియా.. రెండో వన్డేలో అటువంటి ప్రదర్శన చేయలేకపోయింది. 162 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు 5 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్‌గా వచ్చిన కెఎల్ రాహుల్ (1) నిరాశపరిచాడు. రీ ఎంట్రీలో మెరిసేందుకు ఇన్నింగ్స్ ఆరంభించినా.. కెప్టెన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (33, 21 బంతుల్లో 4 ఫోర్లు) సహజశైలిలో దూకుడుగా ఆడాడు. నాలుగు ఫోర్లతో ధనాధన్ అనిపించాడు. శుభ్‌మన్ గిల్ (33, 34 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి రెండో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసిన శిఖర్ ధావన్ ఆ క్రమంలోనే వికెట్ కోల్పోగా..క్రీజులో నిలదొక్కుకున్న శుభ్‌మన్ గిల్ సైతం మంచి ఆరంభాన్ని కొనసాగించలేదు. ఇషాన్ కిషన్ (6) నిరాశపరిచాడు. 97/4తో భారత్ కాస్త ఒత్తిడిలో పడినట్టు కనిపించింది. ఈ సమయంలో దీపక్ హుడా (25, 36 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి సంజు శాంసన్ (43 నాటౌట్)ను ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ ఇద్దరి బాధ్యతాయుత భాగస్వామ్యంతో భారత్ అలవోకగా గెలుపొందింది. చివర్లో దీపక్ నిష్క్రమించినా.. అక్షర్ పటేల్ (6 నాటౌట్)తోడుగా సంజు శాంసన్ లాంఛనం ముగించాడు. సహజశైలిలో రాణించిన సంజు శాంసన్.. వికెట్ కాపాడుకుని ఇన్నింగ్స్‌లో ప్రత్యేకత చూపించాడు. నాలుగు సిక్సర్లు, మూడు ఫోర్లతో సంజు ధనాధన్ షో చూపించాడు. మరో 146 బంతులు మిగిలి ఉండగానే భారత్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
జింబాబ్వే విలవిల! : జింబాబ్వే వరుసగా రెండో మ్యాచ్‌లో భారత బౌలింగ్ పదును ముందు తేలిపోయింది. తొలి వన్డే హీరో దీపక్ చాహర్‌కు విశ్రాంతి లభించగా.. అతడి స్థానంలో శార్దుల్ ఠాకూర్ (3/38) విశ్వరూపం చూపించాడు. మహ్మద్ సిరాజ్ (1/16)తో కలిసి కొత్త బంతి పంచుకున్న శార్దుల్ ఠాకూర్ జింబాబ్వే టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు. కయటనో (7), ఇన్నోసెంట్ (16), వెస్లీ (2), చకబ్వా (2) తేలిపోయారు. స్టార్ బ్యాటర్ సికందర్ రజా (16, 31 బంతుల్లో) మరోసారి అంచనాలను అందుకోలేదు. సీన్ విలియమ్స్ (42, 42 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), రియాన్ బర్ల్ (39, 47 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించటంతో జింబాబ్వే 161 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో కుల్దీప్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణలు తలా ఓ వికెట్ పడగొట్టారు. 38.1 ఓవర్లలోనే జింబాబ్వే పది వికెట్లు కోల్పోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా.. ఆతిథ్య జింబాబ్వే బ్యాటర్లకు ముకుతాడు వేయటంలో విజయవంతమైంది.
బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు పని చేయలేదు. అయినా, మేమేమీ ఆందోళనలో పడలేదు. బ్యాటింగ్ లైనప్‌లో లోతుగా వెళ్లాం. నేను కొన్ని పరుగులు చేయాలనే ఆలోనతో ఓపెనింగ్ చేశాను. అది సాధ్యపడలేదు. బహుశా, చివరి మ్యాచ్‌లో అది కుదురుతుందేమో. నేను టెలివిజన్‌లో చూశాను.. జింబాబ్వే బౌలింగ్ విభాగం నాణ్యమైనది, బంగ్లాదేశ్‌కు వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత బౌలర్లు గొప్ప ప్రదర్శన చేశారు. బ్యాటర్లకు ఇది మంచి సవాల్. టాప్ ఆర్డర్ కాస్త తడబడినా.. కంగారూ పడలేదు. ఇక ఎక్కడికి వెళ్లినా.. భారత అభిమానుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. అభిమానుల కేరింతల నడుమ ఆడటం సంతోష ంగా అనిపించిందని మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ కెఎల్ రాహుల్ తెలిపాడు.
స్కోరు వివరాలు
జింబాబ్వే ఇన్నింగ్స్ : కయటనో (సి) శాంసన్ (బి) మహ్మద్ సిరాజ్ 7, ఇన్నోసెంట్ (సి) శాంసన్ (బి) శార్దుల్ ఠాకూర్ 16, వెస్లీ (సి) శాంసన్ (బి) ప్రసిద్ కృష్ణ 2, రేగిస్ చకబ్వా (సి) శుభ్‌మన్ గిల్ (బి) శార్దుల్ ఠాకూర్ 2, సికందర్ రజా (సి) ఇషాన్ కిషన్ (బి) కుల్దీప్ యాదవ్ 16, సీన్ విలియమ్స్ (సి) శిఖర్ ధావన్ (బి) దీపక్ హుడా 42, రియాన్ బర్ల్ నాటౌట్ 39, ల్యూక్ జాంగ్వే (బి) శార్దుల్ ఠాకూర్ 6, బ్రాడ్ ఎవాన్స్ (బి) అక్షర్ పటేల్ 9, విక్టర్ రనౌట్ 0, టనక చివాంగ రనౌట్ 4, ఎక్స్‌ట్రాలు : 18, మొత్తం : (38.1 ఓవర్లలో ఆలౌట్) 161.
వికెట్ల పతనం : 1-20, 2-27, 3-29, 4-31, 5-72, 6-105, 7-129, 8-149, 9-156, 10-161.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 8-2-16-1, ప్రసిద్ కృష్ణ 6.1-1-28-1, శార్దుల్ ఠాకూర్ 7-0-38-3, అక్షర్ పటేల్ 7-1-20-1, కుల్దీప్ యాదవ్ 8-0-49-1, కుల్దీప్ యాదవ్ 8-0-49-1, దీపక్ హుడా 2-0-6-1.
భారత్ ఇన్నింగ్స్ : శిఖర్ ధావన్ (సి) కయ (బి) చివాంగ 33, కెఎల్ రాహుల్ (ఎల్బీ) న్యూచి 1, శుభ్‌మన్ గిల్ (సి) ఎవాన్స్ (బి) జాంగ్వే 33, ఇషాన్ కిషన్ (బి) జాంగ్వే 6, దీపక్ హుడా (సి) సికందర్ రజా 25, సంజు శాంసన్ నాటౌట్ 43, అక్షర్ పటేల్ నాటౌట్ 6, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (25.4 ఓవర్లలో 5 వికెట్లకు) 167.
బౌలింగ్ : చివాంగ 7-0-38-1, విక్టర్ 4-0-32-1, ల్యూక్ జాంగ్వే 4-0-33-2, బ్రాడ్ ఎవాన్స్ 4-0-21-0, సికందర్ రజా 4-0-16-1, సీన్ విలియమ్స్ 1-0-13-0, వెస్లీ 1-0-7-0, ఇన్నోసెంట్ 0.4-0-6-0.