Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీని ఓడించటమే లక్ష్యం
- మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్ధతు
- విలేకర్లతో సీపీఐ నేతలు నారాయణ, చాడ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీని ఓడించటమే తమ రాజకీయ విధానమని సీపీఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికల్లో మతోన్మాద పార్టీని ఓడించగలిగే టీఆర్ఎస్కు మద్దతునివ్వాలని తమ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశలో నిర్ణయించినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి వెల్లడించారు. శనివారం హైదరాబాద్లోని మఖ్దూం భవన్లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, బాగం హేమంతరావు, ఎన్.బాల మల్లేశ్ కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చాడ మాట్లాడారు.
ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని ప్రమాదంలో పడేస్తున్న బీజేపీని దేశ వ్యాప్తంగా ఓడించేందుకు కేవలం మునుగోడు ఉప ఎన్నికకే పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తామని చెప్పారు. సీపీిఐ మద్దతుతో మునుగోడు శాసన సభకు కాంగ్రెస్ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమైందన్నారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన బీజేపీలో చేరుతున్నారనీ, ఆ పార్టీ ప్రజలపై బలవంతంగా ఉప ఎన్నికను రుద్దుతున్నదనీ, ఈ ఎన్నికను బీజేపీి ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు ఆ పార్టీ కేంద్ర నాయకత్వం మొత్తం ఇక్కడ గందరగోళం సృష్టించటం కోసం కుట్రలు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలోని ప్రగతిశీల శక్తుల ముందు తాము నిలబడలేమనే విషయం మతోన్మాద పార్టీకి అర్థం కావాలన్నారు. మతోన్మాద, నియంతృత్వ, ఫాసిస్టు బీజేపీని ఓడించడమే లక్షంగా జాతీయ పార్టీ తీర్మానం ఉన్నదనీ, దేశంలో లౌకిక, వామపక్ష, ప్రజతాతంత్ర శక్తులతో వేదికను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉన్నదని తెలిపారు. తెలంగాణలో కూడా ఈ వేదికను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. కేసీఆర్ సైతం దేశంలో బీజేపీిని ఓడిందేందుకు ప్రజాతంత్ర, లౌకిక శక్తులను కూడగట్టేందుకు కార్యాచరణ తీసుకుంటానని చెప్పారని గుర్తు చేశారు. విభజన హామీల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఎనిమిదేళ్ళలో అమలు చేయని బీజేపీకి మునుగోడులో ఓటు అడిగే హక్కు లేదన్నారు. కాంగ్రెస్ నిర్మాణ పరిస్థితి, పార్టీ గురించి అందరికీ తెలుసుననీ, 2018లో మహాకూటమి పేరుతో కాంగ్రెస్ ఏ విధంగా వ్యవహరించిందో తెలిసిందేనని గుర్తు చేశారు. టీఆర్ఎస్కు మద్దతునిచ్చినంత మాత్రాన పోరాటాలు ఆగబోవని చెప్పారు.
మోడీ ప్రొత్బలంతో వచ్చిన ఎన్నికలు.. నారాయణ
మునుగోడు ఉప ఎన్నిక సహజంగా వచ్చింది కాదనీ, అది మోడీ ప్రోద్భలంతో వచ్చిన అసహజ ఎన్నికలని నారాయణ తెలిపారు. బీజేపీి అధికారంలోకి వచ్చాక తొమ్మిది రాష్ట్రాల్లో తనకు వ్యతిరేకంగా వచ్చిన పార్టీల ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల దోసిందన్నారు. ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని జైళ్ళకు పంపుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉప ఎన్నికల్లో బీజేపీనిని ఓడిస్తే ఆ సందేశం దేశమంతటికీ పోతుందన్నారు.