Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
నవతెలంగాణ-నర్సాపూర్
బీజేపీని వెనకాల నుంచి నడిపిస్తున్నదని పెట్టుబడిదారులేనని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు విమర్శించారు. శనివారం మెదక్ జిల్లా నర్సాపూర్‌లో జరిగిన సీఐటీయూ 14వ జిల్లా మహాసభలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీజేపీకి డబ్బులు ఖర్చు పెడుతున్నది పెట్టుబడిదారులేనని ఆరోపించారు. అందువల్లే కార్మిక చట్టాలను కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ఆదాని, అంబానీ తప్ప సామాన్య ప్రజలు గుర్తుకురావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ది కోసమే బీజేపీ మతోన్మాదం పేరిట ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని విమర్శించారు.
గుజరాత్ రాష్ట్రంలో గర్భిణీపై లైంగికదాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాల్సింది పోయి.. వారికి సన్మానం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు తినే తిండిపైనా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరుతో పన్ను వసూలు చేస్తున్నదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 5న ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ మహాసభలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.మల్లికార్జున్, మెదక్ జిల్లా అధ్యక్షులు ఏ.మల్లేశం, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి నర్సమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు, మహేందర్ రెడ్డి, నాయకులు బాలమణి తదితరులు పాల్గొన్నారు.