Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుల దీక్షకు సీపీఐ(ఎం), కేవీపీఎస్ నాయకుల మద్దతు
నవతెలంగాణ-షాబాద్
అభివృద్ధి ముసుగులో కంపెనీల పేరుతో రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడం లేదని, భూనిర్వాసితులకు వెంటనే న్యాయం చేయాలని సీపీఐ(ఎం) చేవెళ్ల డివిజన్ ఇన్చార్జి అల్లి దేవేందర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మస్కు ప్రకాశ్‌కారత్ డిమాండ్ చేశారు. తమకు నష్టపరిహారం ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్‌వెళ్లి భూబాధితులు నిరవధిక దీక్ష చేపట్టారు. వీరికి శనివారం సీపీఐ(ఎం), కేవీపీఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐఐసీ చందన్‌వెళ్లి, హైతాబాద్ గ్రామాల్లో రైతుల నుంచి దాదాపు 2వేల ఎకరాల భూమిని సేకరించిందన్నారు. ఈ భూమిని బడా కంపెనీలకు అప్పగించిందని విమర్శించారు.కంపెనీల కోసం భూములిచ్చిన రైతులకు మాత్రం నష్టపరిహారం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, సర్వేనెంబర్ 190లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలన్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కాలే యాదయ్య, మంత్రి సబితాఇంద్రారెడ్డి వెంటనే స్పందించాలని కోరారు. నష్టపరిహారం చెల్లించని పక్షంలో రైతుల భూములు తిరిగి రైతులకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శంకర్, చేవెళ్ల డివిజన్ కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు నితీష్‌గౌడ్, సాయిగణేష్, రైతులు పాల్గొన్నారు.