Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభం
నవతెలంగాణ-నంగునూరు
బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఎందుకు మంజూరు చేయలేదని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ మృహ ప్రవేశాలను శనివారం మంత్రి ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, ఏఎన్ఎం సబ్ సెంటర్ ప్రహరీ, పాలమాకుల నుంచి నర్మెట వరకు బీటీ రోడ్డు మరమ్మతు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రతిపాదించినా బీసీ మంత్రిత్వ శాఖకు ఆమోదం తెలపకపోవడంపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉంటే మరింత న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ కావాలని కోరినా కేంద్రం ఇప్పటికీ సమాధానం చెప్పలేదన్నారు.
పాలమాకులలో ఇప్పటికే 55 ఇండ్లను ప్రారంభిం చుకున్నామని చెప్పారు. ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. అర్హులైన పేదలకు 30 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయిస్తానని హామీనిచ్చారు. త్వరలోనే మీ ఇంటి జాగలో ఇల్లు కట్టుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు రెండు పడకల ఇండ్లు రాష్ట్రంలో అందిస్తున్నామని తెలిపారు. మోడీ ప్రభుత్వం పేదలకు ఉచితాలు, సబ్సిడీలు వద్దంటూ.. పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందని విమర్శించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వ ఉచితాలపై ఎద్దేవా చేయడం సరికాదన్నారు. త్వరలోనే అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని తెలిపారు.
తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచితే, బీజేపీ మాత్రం పెరిగిన సంపదను బడా కార్పొరేటర్లకు పంచిందని విమర్శించారు. తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు రైతులకు అందిస్తుంటే కండ్లు మండిన బీజేపీ.. తెలంగాణ ప్రజలకు కరెంట్ రాకుండా అడ్డుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏవర్గం బాగుపడ్డ్డదో? ఎవరికి లాభం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పంగకుమార్, జెడ్పీటీసీ తడిసిన ఉమా, మార్కెట్ కమిటీ చైర్మెన్ రాగుల సారయ్య, మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ ఎడ్ల సోమిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఆనగోని లింగం గౌడ్, ఎంపీటీసీ ఏటి తులసి పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.