Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిశీల శక్తుల ఏకీకరణ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాం..
- మునుగోడు ఎన్నికపై వారంలో స్పష్టత
- విషప్రాంతంగా మూసీ పరివాహక ఏరియా
- ఎన్ఆర్సీపీ కింద రూ. 8 వేల కోట్లు ఇవ్వాలి...: సీపీఐ(ఎం) పోరుయాత్ర సభలో తమ్మినేని, చెరుపల్లి
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ వ్యతిరేకశక్తులతో కలిసి పోరాడుతామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మూసీనది ప్రక్షాళన చేయాలన్న డిమాండ్‌తో సీపీఐ(ఎం) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 21 నుంచి 28 వరకు పోరు యాత్ర చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆదివారం భువనగిరి మండలం అనాజీపురం గ్రామపంచాయతీ నుంచి తమ్మినేని పోరుయాత్రను ప్రారంభించి మాట్లాడారు. బీజేపీ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పబ్బంగడుపుకుంటున్నదని విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను పూర్తిగా అమ్మేస్తుందని విమర్శించారు. దక్షిణ తెలంగాణలో పార్టీని బలోపేతం చేసుకునే ఆలోచనతోనే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో రాజీనామా చేయించి ఎన్నికలు తీసుకొచ్చారని విమర్శించారు. అభివృద్ధికి నిధులు ఇవ్వడంలేదని రాజీనామా చేయడం అవకాశవాదానికి నిదర్శమన్నారు. మునుగోడుకు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిందేమీ లేదన్నారు. బీజేపీని ఓడించేందుకు అందరం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఎన్నికలలో తమ వైఖరిని వారం రోజుల్లో స్పష్టం చేస్తామన్నారు. ప్రగతిశీలశక్తుల ఏకీకరణ కావాలనే సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ.. మొదటి నుంచి ఈ నినాదంతోనే తామూ పనిచేస్తున్నామని స్పష్టంచేశారు.
విషతుల్యంగా మారిన మూసీనదిని ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. యాదాద్రి జిల్లాలో సుమారు 160 చెరువులు మూసీ నీటి ద్వారా నిండుతున్నాయని తెలిపారు. ఐదు కాల్వల ద్వారా మూసీనది పారుతోందని, సుమారు పది మండలాల్లో మోజార్టీ సాగు ఈనీటిపైనే ఆధారపడి ఉందనన్నారు. ప్రస్తుతం కాలుష్య నివారణ పెద్దసమస్యగా మారిందని వాపోయారు. నదుల ప్రక్షాళన చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో మూసీనదిని కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. నదీ జలాల శుద్ధిని వెంటనే చేయాలనే డిమాండ్‌తో మూసీనది ప్రక్షాళన కోసం సీఎం కేసీఆర్, ప్రధాని మోడీలకు రాష్ట్ర కమిటీ నుంచి లేఖలు కూడా రాస్తామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన కొన్ని హామీలు ఇంకా అమలు కాలేదని, కొత్త రేషన్‌కార్డులు, ఇండ్లు, నిరుద్యోగభృతి తదితర హామీలు ఆచరణలోకి రాలేదన్నారు. ఆ పార్టీ కేంద్రకమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. మూసీ కాలుష్యమయం అవడం వల్ల దాని కింద పండిన పంటలను కొనుగోలు చేయాలంటే ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మూసీ ప్రక్షాళన విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రం బాధ్యత మరిచి నిధులివ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రక్షాళన కోసం ఎందుకు నిధులు తేవడంలేదని ప్రశ్నించారు. ప్రక్షాళన కోసం రాష్ట్రానికీ బాధ్యత ఉంది కానీ, కేంద్రం కూడా సహకారం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. రూ.8వేల కోట్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే గంగానదికి మాత్రం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ ధర్నా చేసి నిధులు తెప్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదనీ విమర్శించారు. చెప్పినట్లుగా వినకపోతే రాష్ట్ర ప్రభుత్వాలనూ నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. కాగా, కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, స్థానిక సర్పంచ్ ఏదునూరి ప్రేమలత మల్లేశం, ఎంపీటీసీ గునుగుంట్ల కల్పన శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు.