Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాన్ని పాఠశాల స్థాయి నుంచే పిల్లల్లో పెంపొందించాలి
- మూఢత్వ, అంధ విశ్వాసాలపై ప్రశ్నించడం నేర్పాలి : హమీద్ దభోల్కర్
- మహారాష్ట్ర తరహా చట్టం యుగాండలో అమలు : రాచకొండ కమిషనర్ మహేశ్‌భగవత్
- రేపిస్టులకు, మర్డర్లు చేసేవారికి స్వతంత్రం వచ్చింది : డాక్టర్ చందనా చక్రవర్తి
- శాస్త్రీయ దృక్పథం మతాన్ని ప్రశ్నిస్తుంది... : జస్టిస్ డాక్టర్ రాధారాణి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రతి ఒక్కరికీ శాస్త్రీయ స్పృహ అవసరమనీ, దాన్ని పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలనా సంస్థ నిర్వాహకులు, ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ హమీద్ దభోల్కర్ నొక్కి చెప్పారు. మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలపై ప్రశ్నించడం నేర్పాలని కోరారు. అప్పుడే సమాజం ముందుకు పోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో 40 ప్రజాసంఘాలు కలిసి మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం కోసం ముసాయిదా తయారు చేయడం మంచి పరిణామం అన్నారు. దాన్ని చట్ట రూపంగా మార్చేందుకు కృషి చేయాలని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మూఢనమ్మకాల నిర్మూలనా చట్ట సాధన సమితి ఆధ్వర్యంలో జాతీయ వైజ్ఞానిక దృక్పథ దినోత్సవాన్ని పురస్కరించుకుని నరేంద్ర దభోల్కర్ సంస్మరణ, వైజ్ఞానిక సాంస్కృతిక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హమీద్ దభోల్కర్ మాట్లాడుతూ.. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దబోల్కర్ని మతోన్మాదులు హత్య చేశారన్నారు. పోరాటాల ఫలితంగా నరేంద్ర దభోల్కర్ కోరుకున్న చట్టం మహారాష్ట్రలో వచ్చిందనీ, త్యాగాలు, పోరాటాల వల్లనే విజయం దక్కుతుందనడానికి మంచి ఉదహరణ అని చెప్పారు. ఆ చట్టానికి కొందరు మతోన్మాదులు అభ్యంతరాలు తెలుపుతూ అడ్డుకుంటున్న విషయాన్ని వివరించారు. ఈ చట్టానికి గైడ్‌లైన్స్ రావాల్సి ఉందని చెప్పారు. మతోన్మాదులు సైన్స్‌ను నమ్మకుండా దాన్ని వ్యతిరేకిస్తూనే ఆ సైన్స్ ఫలాలను మతోన్మాదులు పొందుతున్నారని గుర్తుచేశారు. యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అశాస్త్రీయ భావాలను ప్రచారం చేస్తున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వైజ్ఞానిక దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి పట్టుదలతో ముందుకెళ్తూ పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. తాము ధర్మానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలేదనీ, దేవుడి పేరుతో దోపిడీ చేస్తున్న తీరును వ్యతిరేకిస్తున్నామనే విషయాన్ని సామాన్యులకు విడమర్చి చెప్పాలని పిలుపునిచ్చారు. రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్‌భగవత్ మాట్లాడుతూ.. దబోల్కర్ గొప్ప వక్త, పోరాట యోధుడు అని కొనియాడారు. మహారాష్ట్రలో తీసుకొచ్చిన మూఢనమ్మకాల నిర్మూలనా చట్టం యుగాండ దేశంలో అమలు చేస్తున్న తీరును వివరించారు. మూఢ, అంధ విశ్వాస ఘటనలు ఎక్కడ జరిగినా వాటి నిర్మూలన కోసం తన వంతు కృషి చేస్తున్నానని చెబుతూ పలు ఉదహరణలు వివరించారు. బీబీనగర్‌లో పాము పగబట్టిందని నమ్మించి ఓ వ్యక్తి నుంచి 38 లక్షలను రాజస్థాన్ ముఠా తీసుకెళ్లిందని చెప్పారు. ఆ ఘటనను ఛాలెంజ్‌గా తీసుకుని రాజస్థాన్ వెళ్లి మరీ మోసం చేసిన వారి పట్టుకొచ్చి ఆ సొమ్మును రికవరీ చేశామని తెలిపారు. జనవిజ్ఞాన వేదిక, పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్‌తో కలిసి చాలా జిల్లాల్లో విద్యార్థులకు, ప్రజలకు మూఢనమ్మకాలను నమ్మొద్దని అవగాహన కల్పించామన్నారు. హైకోర్టు జస్టిస్ డాక్టర్ రాధారాణి మాట్లాడుతూ..శాస్త్రీయ దృక్పథాన్ని ప్రజల్లో పెంపొదింపజేయడాన్ని మతం మీద దాడిగా మతోన్మాదులు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ ప్రశ్నించడాన్ని ప్రోత్సహిస్తే, అదే మతం ప్రశ్నించడాన్ని సహించదని చెప్పారు. దేశంలో సూడో ప్రచారం ఎక్కువవుతున్నదనీ, అదే సమయంలో వైజ్ఞానిక ప్రగతికి, పరిశోధనలకు నిధులను పాలకులు తగ్గిస్తున్న తీరుని వివరించారు. ఇది ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. మానవతావాది డాక్టర్ చందనా చక్రవర్తి మాట్లాడుతూ..ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ల్లో కూడా సూడో సైన్స్‌ను తెరపైకి తేవడంపై దేశానికే ప్రమాదకరమని హెచ్చరించారు. సీసీఎమ్‌బీ వ్యవస్థాపకులు డాక్టర్ పీఎం భార్గవ మూఢనమ్మకాలు, అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడ్డారని గుర్తుచేశారు. ఆజాదికా అమృత్‌మహోత్సవ్ వేళ రేపిస్టులకు, మర్డర్లు చేసేవాళ్లకు స్వతంత్రం వచ్చిందని విమర్శించారు. ఎమ్మెల్యేలు కూడా రేపిస్టులకు మద్దతుగా మాట్లాడటం దేశంలోని ప్రమాద ఘంటికలను ఎత్తిచూపుతున్నాయన్నారు. మ్యాన్‌హోళ్లను యంత్రాలతో శుద్ధి చేసే టెక్నాలజీని పాలకులు ఉపయోగించడం లేదనీ, దళితులు, వెనుకబడిన సామాజిక తరగతులతో ఆ పని చేయిస్తున్నారని తెలిపారు. ఇది సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకెళ్లడమేనన్నారు. తెలంగాణ రాష్ట్ర అమానవీయ మూఢాచారాల, బాణామతి నిరోధక , నిర్మూలన చట్టం-2021 ముసాయిదాను వేదికపై విడుదల చేశారు. మూఢ నమ్మకాల నిర్మూలనా చట్టసాధన సమితి కన్వీనర్ టి.రమేశ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భూపతి వెంకటేశ్వర్లు(టీపీఎస్కే), బీఎన్‌రెడ్డి (జనవిజ్ఞాన వేదిక), బి.సాంబశివరావు (మానవ వికాస వేదిక), ఎమ్డీ వాహిద్(కుల నిర్మూలనా సంఘం), పి.శంకర్(డీబీఎఫ్), గంజి బసవరలింగం(ఏఈఓడీపీఏ), టి.భాస్కర్(ఎమ్వీవీ), ఝాన్సీ(పీఓడబ్ల్యూ), విజయ కందుకూరి(విజ్ఞాన దర్శిని), సారయ్య(భారత నాస్తిక సమాజం), తదితరులు పాల్గొని మాట్లాడారు.