Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆస్పత్రిలో ఎక్కువ కాలం ఉండే అవసరముండదు
- ఎంఎన్ జేలో క్యాన్సర్ రోగులకు ఆధునిక చికిత్స
- భారీగా తగ్గిపోనున్న వెయిటింగ్ సమయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆధునిక కాలంలో రోబోటిక్ సేవలు కీలకంగా మారాయి. వైద్యచికిత్సల్లోనూ వీటిని ఉపయోగించడం ఇటీవల కాలంలో పెరిగింది. ఇప్పటి వరకు ఎక్కువగా కార్పొరేట్ ఆస్పత్రులు తమ వద్ద రోబోటిక్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ప్రచారం చేసుకుంటూ ఆకట్టుకుంటున్నాయి. రోబోటిక్ శస్త్రచికిత్సల ద్వారా కచ్చితమైన ఫలితం, తక్కువ సమయం, త్వరగా కోలుకోవడం, సైడ్ ఎఫెక్ట్స్ లేకపోవడం తదితర ప్రయోజనాలుండటంతో రోగులు సైతం అలాంటి సర్జరీలకు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లోను ఇలాంటి సేవలను తీసుకొచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అంటే ఎదురు చూడాల్సిందే. అందులోనూ క్లిష్టమైన శస్త్రచికిత్సలంటే మరీ నెలల తరబడి తమ వంతు వచ్చే వరకు ఆగాల్సిందే. దీంతో రోగులు తరచుగా ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రులవైపు బలవంతంగా నెట్టబడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిని తప్పించేందుకు ప్రభుత్వాస్పత్రుల్లోకి ఆధునాతన చికిత్సను అందుబాటులోకి తేవడం, సత్వర చికిత్సకు సౌకర్యం కల్పించాలని నిపుణులు సూచిస్తున్నా పరిస్థితులు మారడం లేదు. దీన్నుంచి గట్టేక్కేందుకు, కార్పొరేటు ఆస్పత్రులు విసురుతున్న సవాళ్లను తట్టుకుని రోగులకు సత్వర చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రత్యేకించి క్యాన్సర్ రోగులకు శస్త్రచికిత్సలు అవసరమైన సమయంలో రాష్ట్రంలోనే అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది. ఇందులో మార్పు తెచ్చేందుకు ఎనిమిది ఆధునాతన ఆపరేషన్ థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టారు.
ప్రస్తుతం ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రిలో ప్రతి రోజూ 20 నుంచి 30 మంది రోగులకు పెద్ద, చిన్న శస్త్రచికిత్సలను ఎదురు చూస్తుంటారు. అయితే హాస్పిటల్ లో ఉన్న మూడు పాత థియేటర్లలో ప్రతి రోజు నాలుగైదు పెద్దవి, నాలుగైదు చిన్న ఆపరేషన్లు చేస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో శస్త్రచికిత్స అవసరమని నిర్ణయించిన రోగులకు అది చేయించుకునేందుకు కనీసం రెండు నెలలు ఆగక తప్పని పరిస్థితి. దాదాపు వెయ్యి మందికి పైగా క్యాన్సర్ రోగులు శస్త్రచికిత్స కోసం తమ పేర్లను నమోదు చేసుకుని ఉన్నారు. ఎదురు చూసే సమయాన్ని తగ్గించేందుకు ఒక రోబోటిక్ సర్జరీ థియేటర్‌తో పాటు, మరో ఏడు మాడ్యులర్ థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇవి రాబోయే నెల రోజుల్లో పూర్తి కానున్నాయి. ఇవి అందుబాటులోకి వస్తే ప్రతి రోజూ 20 నుంచి 30 వరకు శస్త్రచికిత్సలు చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ క్యాన్సర్ ఆస్పత్రిలో తొలిసారిగా రొబోటిక్ సర్జరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
సర్జరీ కోసం ఎదురు చూసే సమయమే కాకుండా రోబోటిక్ సర్జరీతో అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నట్టు ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ జయలత తెలిపారు. సాధారణ పద్ధతిలో ఐదారు గంటలు పట్టే సర్జరీని రెండు నుంచి మూడు గంటల్లో పూర్తి చేయొచ్చు. చేతులను ఉపయో గించడం తగ్గిపోతుంది. థియేటర్లు సైతం ఇన్ఫెక్షన్ రహితంగా ఉండి రోగి పోస్ట్ ఆపరేటివ్ పర్యవేక్షణ 10 రోజుల నుంచి రెండు నుంచి మూడు రోజులకు తగ్గి తొందరగా కోలుకుని డిశ్చార్జి కావచ్చు. ప్రయివేటు, కార్పొరేటు ఆస్పత్రుల్లో రోబోటిక్ సర్జరీలకు ప్రస్తుతం రూ.నాలుగు లక్షలకుపైగా వసూలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాస్పత్రిలోనే ఈ శస్త్రచికిత్స అందుబాటులోకి వస్తే పేద క్యాన్సర్ రోగులకు మరింత ప్రయోజనం చేకూరనున్నది. రోబోటిక్ సర్జరీ లేదా మాడ్యులర్ థియేటర్లలో సర్జరీ అనేది ఆయా రోగుల అవసరాలను బట్టి సర్జన్స్ నిర్ణయిస్తారు.