Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పెషల్ ఆఫ్ డ్యూటీలను యధావిధిగా కొనసాగించాలి
- సీఐటీయూ ఆధ్వర్యంలో మహిళా కండక్టర్ల నిరసన
నవతెలంగాణ - బోధన్
మహిళ కండక్టర్లు అదనపు పనిభారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, 16 గంటలు పనిభారాన్ని తగ్గించాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆదివారం రాత్రి సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా బోధన్ డిపో ఎదుట మహిళా కండక్టర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడారు. ప్రభుత్వం మహిళా కండక్టర్లకు 8 గంటలకే విధులు ముగించేలా అవకాశం ఇచ్చామని చెపుతున్నా ఆర్టీసీ డిపో అధికారులు మాత్రం రాత్రి 11 గంటల వరకు పనిచేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు అదేవిధంగా స్పెషల్ ఆఫ్ డ్యూటీని డే ఔట్ గా మార్చడం దారుణమని, దాంతో మహిళా కండక్టర్ల పై పని భారం పడుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకొని స్పెషల్ ఆఫ్ డ్యూటీని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా బస్ కండక్టర్లు, డ్రైవర్లపై అదనపు భారాన్ని మోపి వేధింపులకు గురి చేయడం తగదని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని డీఎంని కోరినా పై అధికారుల ఆర్డర్ని చెప్పడం సరికాదన్నారు. అదేవిధంగా డీఎం సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధతం చేస్తామని హెచ్చరించారు. కాగా, ఆందోళన చేస్తున్న మహిళా కండక్టర్ల వద్దకు వచ్చిన డీఎం స్వామి.. సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. నిరసనలో సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు గంగాధర్ అప్పా, సీఐటీయూ టౌన్ సెక్రెటరీ శంకర్ గౌడ్, సీనియర్ నాయకులు గంగాధరప్ప, నాగలక్ష్మి, గంగమని చంద్రకళ, రాణి, కుమారి, సంగీత, ధనలక్ష్మి, పద్మజ, సుమన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.