Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొమురవెల్లి
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న ఆలయ ఆర్థికలావాదేవీల ఆదాయపు పన్ను లెక్కల్లో గోల్మాల్ జరిగింది. ప్రతేడాది ఆదాయపన్ను శాఖకు ఆలయ ఆదాయ, వ్యయాలు, నగదు నిల్వ, డిపాజిట్లకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఆడిటర్‌తో ఆడిట్ జరగాల్సి ఉంటుంది. రామకృష్ణారావు ఆలయ కార్యనిర్వహణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న సమయంలో మల్లన్న ఆలయానికి సంబంధించిన బ్యాంక్ డిపాజిట్లకు పాన్‌కార్డు తప్పనిసరిగా జత చేయాల్సి వచ్చింది. దాంతో ఆలయ సూపరింటెండెంట్ నీల శేఖర్ ఆలయానికి సంబంధించిన పాన్‌కార్డు ఇవ్వకుండా ఈవో రామకృష్ణారావు వ్యక్తిగత పాన్ కార్డు ఇచ్చారు. దాన్ని బ్యాంక్ అధికారులు ఆలయ ఖాతాకు ఎంట్రీ చేశారు. దాంతో ఆలయ బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ టీడీఎన్ రూపంలో రామకృష్ణారావు ఇన్‌కంట్యాక్స్ పాన్‌కార్డు ఖాతాలో పడుతున్నాయి. అలా రూ.7 లక్షల మేర నిల్వలు ఉన్నట్టు ఇన్ కంట్యాక్స్ వ్యక్తిగత ఆడిటర్ ఇటీవల గుర్తించారు. అప్పటి మాజీ ఈవో, ప్రస్తుత డిప్యూటీ కమిషనర్ రామకృష్ణారావు మల్లన్న ఆలయ అధికారులకు వాటిని సవరించాలంటూ, నీల శేఖర్ చేసిన తప్పిదానికి ఛార్జ్ మెమో ఇవ్వాలని ఆదేశించారు. ఈ విషయంపై ఈవో బాలాజీని నవ తెలంగాణ ఆదివారం వివరణ కోరగా.. 1996 నుంచి మల్లన్న ఆలయానికి పాన్‌కార్డు ఉందని, అతను ఏ ఉద్దేశంతో అప్పటి ఈవో వ్యక్తిగత పాన్ కార్డును సూపరింటెండెంట్ శేఖర్ బ్యాంకుకు ఇచ్చారో విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ఆ ఒక్క లావాదేవీలో తప్పిదం జరిగిందని, తదుపరి ఆదాయ వ్యయాలు ఆదాయపు పన్ను శాఖ ఆడిటర్ అధీనంలోనే ఆడిట్ జరుగుతున్నాయని తెలిపారు. ఆలయంలో ఆదాయ వ్యయాలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ ఆడిటర్లో పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సూపరింటెండెంట్ నీల శేఖర్‌కు ఛార్ట్మె మో జారీ చేశామని, మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.