Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేట్లకు ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం
- సంక్షేమ పథకాలను ఉచిత పథకాలు అంటున్నారు
- కార్పొరేట్ల తొత్తు బీజేపీని ఓడించాలి: సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
శతకోటీశ్వర్ల తరఫున మోడీ పాలన కొనసాగిస్తున్నారని, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మేస్తున్నారని సీపీిఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఐ జిల్లా మహాసభ సందర్భంగా సోమవారం భువనగిరి మార్కెట్ యార్డులో జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు అధ్యక్షతన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ.. బీజేపీ అఖండ భారత్ పేరు మీద వితండవాదం చేస్తుందన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన ఎనిమిదేండ్లలో ఆదాని, అంబానీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగాయన్నారు. 8 విమానాశ్రయాలు, 16 ఓడరేవులు, దేశంలో సగం విద్యుత్ శక్తి, టోల్గేట్లు వంటివి వారి చేతుల్లోకి వెళ్లాయన్నారు. దేశ బొగ్గుగనులను మూసేసి..కార్మికుల పొట్టగొట్టి.. విదేశాల నుంచి బొగ్గు తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్‌పై విపరీతంగా సుంకం విధించారని చెప్పారు. చివరకు పాలు, పెరుగు, శవపేటికలు, తలకు రాసుకునే నూనె మీదా పన్నులు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఉచితాలంటూ. వాటిని ఎత్తేసే కుట్ర చేస్తోందని చెప్పారు. దేశంలో అంతులేని అవినీతి పెరుగుతోందన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో ఆ కాంట్రాక్టులు అనిల్ అంబానికి ఇవ్వాలని బీజేపీ వారు చెప్పినట్టు ఫ్రెంచ్ అధ్యక్షుడు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యుత్ అమ్మకం విషయం కూడా మోడీ చెప్పాడని శీలంక విద్యుత్ బోర్డు మంత్రి చెప్పడం సిగ్గుచేటన్నారు. సంతలో సరుకులా కోట్లాది రూపాయలతో ఇతర పార్టీల నాయకులను కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. నేడు దేశంలో రాజకీయం అతిపెద్ద వ్యాపారం అయిందని తెలిపారు. ఇది దేశానికి తీవ్రనష్టదాయకమన్నారు. కార్పొరేట్ల తొత్తు బీజేపీని ప్రతి ఎన్నికల్లోనూ ఓడిం చాలని పిలుపునిచ్చారు. ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.