Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతుబంధు వర్తింపజేయాలి
- పేదలకు ఇండ్ల స్థలాలివ్వాలి: రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హాలియా
అనేక ఏండ్లుగా సాగు చేసుకుంటున్న గిరిజన, గిరిజనేతర పేదలకు పోడు, అటవీ భూములకు పట్టాలిచ్చి రైతుబంధు వర్తింపజేయాలని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా హాలియా పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సోమవారం రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి అధ్యక్షతన పోడు భూములపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. 2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పోడు, అటవీ భూముల సర్వే చేసి 13 లక్షల భూమిని గుర్తించారన్నారు. ఐదేండ్లకు పైగా వ్యవసాయం చేసిన పోడు, అటవీ రైతులకు మూడున్నర లక్షల ఎకరాలకు మాత్రమే హక్కు పత్రాలు ఇచ్చారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ స్వయంగా అందరికీ పట్టాలిస్తామని, 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చారన్నారు. ఏండ్ల తరబడిగా సేద్యం చేసుకుంటున్న గిరిజనులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు పెట్టడం ఆపాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. హాలియాలో 48 సర్వే నెంబర్లో నివాసం ఉంటున్న పేదలకు వెంటనే ఇండ్ల స్థలాలకు పట్టాలివ్వాలని కోరారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎనిమిదిన్నరేండ్ల కాలంలో లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, సామాన్యులపై పన్నులు వేసి సంపన్నులకు దోచిపెడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేట్‌పరం చేస్తూ పెట్టుబడుదారుల కొమ్ముగాస్తోందన్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న అటవీహక్కుల చట్టం, ఉపాధిహామీ చట్టం, కనీస వేతనాల చట్టం, భూ సంస్కరణలు చట్టం, అసైన్మెంట్ చట్టం, తదితర చట్టాలను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల, మత విద్వేషాలు రెచ్చగొడుతూ.. ఆహారపు అలవాట్లపై నియంత్రణ విధిస్తోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్, వ్యవసాయకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నారి అయిలయ్య, గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, వ్యకాస రాష్ట్ర కమిటీ సభ్యులు కంబాలపల్లి ఆనంద్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు అవుతా సైదులు, నాయకులు తుబ్బా రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.