Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్రం చర్యల్ని ఐక్యంగా తిప్పికొట్టాలి :ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి
- ఏఐఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్ జాతీయ మహాసభల ఆహ్వానసంఘం ఏర్పాటు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని సేవ ముసుగులో కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు కేంద్రప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి అన్నారు. అక్షయపాత్ర, ఇస్కాన్ తదితర సంస్థల కార్యకలాపాలు దీనిలో భాగమేననీ, ఈ ప్రయత్నాలకు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అఖిల భారత మిడ్ డే మీల్స్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏఐఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్) జాతీయ మహాసభలు నవంబర్ 4,5 తేదీల్లో హైదరాబాద్ నిర్వహించాలని నిర్ణయించారు. దీనికోసం ఆహ్వానసంఘం ఏర్పాటు సమావేశం తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మికుల యూనియన్ (టీఎమ్డీడబ్ల్యూయూ), సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఆ సంఘం ఉపాధ్యక్షులు చక్రపాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జాతీయ అధ్యక్షురాలు కే వరలక్ష్మి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ రమ, సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్షులు జంగయ్య, ఎస్టీయూ అధ్యక్షులు సదానందగౌడ్, టీఆర్టీఫ్ నాయకులు అశోక్‌కుమార్, డీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి రఘుశంకర్‌రెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలాబ్‌బాబు పాల్గొన్నారు. పలు రాష్ట్రాలకు చెందిన మధ్యాహ్న భోజన కార్మిక సంఘాల నాయకులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం కులం, మతం ప్రాతిపదికన విద్యార్ధులకు అందించకూడదనే నిబంధనను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని చెప్పారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అక్షయపాత్ర, ఇస్కాన్ వంటి రకరకాల సంస్థల పేరుతో విద్యార్ధులకు అందించే మధ్యాహ్న భోజనాన్ని కార్పొరేట్ల పరం చేస్తున్నారని ఉదహరించారు. మతపరమైన ఆయా సంస్థలు విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించే కోడిగుడ్లు అందించేందుకు నిరాకరిస్తున్నారని చెప్పారు. ఎప్పుడో అర్థరాత్రుళ్లు వండిన ఆహారాన్ని విద్యార్థులకు ఇస్తున్నారనీ, పలు సందర్భాల్లో అవి పాచిపోతున్నాయని అన్నారు. జిల్లాల్లో స్కూళ్లలోనే మధ్యాహ్నం భోజనం వండిపెడుతున్నా, వారికి కావల్సిన సౌకర్యాలు, నిధులు ఇవ్వడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని విమర్శించారు. వీరికి జీతాలు సక్రమంగా ఇవ్వట్లేదనీ, అనేక చోట్ల కేవలం రూ.600 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో వారి వేతనాలను రూ.3వేలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారనీ, కానీ దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇప్పటి వరకు విడుదల కాలేదని అన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, కేరళ, తమిళనాడులో మాత్రమే ఈ స్కీం మెరుగ్గా ఉన్నదని వివరించారు.
విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ప్రభుత్వాలు కేవలం రూ.5 మాత్రమే కేటాయిస్తున్నాయనీ, దీనితో కనీసం టీ నీళ్లు కూడా రావనీ, భోజనాలు ఎలా వండి పెట్టాలని ఆయన ప్రశ్నించారు. అనేక స్కూళ్లలో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పులపాలై, వంట చేయలేమని చేతులెత్తేస్తే, ఉపాధ్యాయులు అక్కడ వంట పనులు చేస్తున్నారని ఉదహరించారు. విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్ కూడా పెట్టాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏజెన్సీల ద్వారా మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారనీ, వారిని తొలుత కార్మికులుగా గుర్తిస్తే, హక్కులకోసం ప్రభుత్వాలతో కొట్లాడేందుకు మార్గం సుగమమవుతుందని అభిప్రాయపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మెలిసి పనిచేస్తూ, వారి మద్దతును పొందాలని సూచించారు. ఏఐఎమ్డీఎమ్డబ్ల్యూఎఫ్ జాతీయ అధ్యక్షురాలు కే వరలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు వల్ల దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపవుట్లు తగ్గినట్టు పలు సర్వేలు వెల్లడించాయన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలంటే సరిపడా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఈ స్కీం నిర్వహణకు 40 శాతం నిధుల్లో కోత పెట్టిందని గుర్తుచేశారు. ఈ స్కీం అమలు కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంఘాల నాయకుల మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే జాతీయ మహాసభల నిర్వహణకు పూర్తిస్థాయిలో సహకరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ ఆహ్వానసంఘం
చైర్మెన్ - ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
వైస్ చైర్మెన్ - సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు
చీఫ్ ప్యాట్రన్ - పీ శ్రీపాల్‌రెడ్డి (పీఆర్టీయూ), కే జంగయ్య (టీఎస్‌యూటీఎఫ్), జీ సదానందగౌడ్ (ఎస్టీయూ), వై అశోక్ (టీఎస్‌టీఎఫ్), అవోక్ (టీఆర్టీఎఫ్), ఎం రఘుశంకర్‌రెడ్డి (డీటీఎఫ్).
జనరల్ సెక్రటరీ - ఎస్వీ రమ (టీఎస్ఎమ్డీఎమ్డబ్యూయూ)
కోశాధికారి - ఉన్నికృష్ణన్ (టీఎస్ఎండీఎమ్డబ్ల్యూయూ)
వీరితో పాటు పలు సంఘాలకు చెందిన వారితో ఆహ్వానసంఘాన్ని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేష్ సభలో ప్రతిపాదించారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.