Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వందల మంది కార్మికులకు గాయాలు
- శాంతియుత ధర్నా పై సీఐఎస్ఎఫ్ పోలీసుల దాడి
- కార్మిక సంఘాల ఆగ్రహం
నవతెలంగాణ - గోదావరిఖని
తమ హక్కుల సాధన కోసం కాంట్రాక్టు కార్మికులు రక్తం చిందించారు. ఓవైపు సీఐఎస్ఎఫ్ బలగాలు లాఠీలు ఝలిపిస్తున్నా కార్మికులు ఏమాత్రం వెనుకడుగు వేయకుండా పోరాటాన్ని కొనసాగించారు. ఈ దాడిలో వందలాది మంది కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ఎన్టీపీసీలోని 3500 మంది కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్నారు. 2018లో కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై జరిగిన సమావేశంలో లొకేషన్లో పనిచేసే ప్రతి కార్మికుడినీ పర్మినెంట్ చేయాలని, వారసత్వ ఉద్యోగ అవకాశం కల్పించాలని, 15ఏండ్లు దాటిన ప్రతి కార్మికుడికీ ప్రమోషన్ కల్పించాలని, సరైన సౌకర్యాలతోపాటు సమస్యలు పరిష్కరించాలని ఒప్పందం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వారి డిమాండ్లు ఒక్కటి కూడా ఎన్టీపీసీ యాజమాన్యం నెరవేర్చలేదు. దీంతో జేఏసీ పిలుపు మేరకు సోమవారం ఎన్టీపీసీ 2వ గేటు వద్ద కాంట్రాక్టు కార్మికులు ధర్నాకు దిగారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఒక్కసారిగా కార్మికులపై లాఠీఛార్జి చేయడంతో సుమారు 100మందికి పైగా గాయాలయ్యాయి. ఇందులో కొందరికి తలలు పగిలి రక్తం కారింది. మరికొందరి కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు. ధర్నాకు పెద్దఎత్తున కార్మికులు, జేఏసీ నాయకులు తరలిరాగా, లాఠీచార్జి చేయడం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు ధర్నా చేస్తుంటే వారిపై లాఠీ ఝలిపించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అగ్రిమెంట్ అమలు అడిగితే చావబాదుతారా..
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి
అగ్రిమెంట్ అమలు చేయాలని అడిగితే చావబాదుతారా అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వేల్పుల కుమారస్వామి ఎన్టీపీసీ రామగుండం యాజమాన్యాన్ని నిలదీశారు. లాఠీచార్జిలో గాయపడిన కార్మికులను ఆయన పరామర్శించారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు 2018లో చేసిన అగ్రిమెంట్‌ను అమలు చేయాలని ఎన్టీపీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నెంబర్-2 గేటు వద్ద శాంతియుతంగా నిరసన తెలిపారని చెప్పారు. ఈ క్రమంలో సీఐఎస్ఎఫ్ సిబ్బంది ఎలాంటి హెచ్చరిక లేకుండా విచక్షణా రహితంగా పశువులను బాదినట్టుగా బాదారని, ఈ హేయమైన చర్యను సీఐటీయూ జిల్లా కమిటీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంట్రాక్టు కార్మికులపై లాఠీచార్జికి ఉసిగొల్పిన ఎన్టీపీసీ యాజమాన్యం దీనికి బాధ్యత వహించాలని హెచ్చరించారు. మహిళా కార్మికులు అని కూడా చూడకుండా చితకబాదడం సిగ్గుచేటన్నారు. అనేకమంది కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలకు ఈ దాడిలో తలలు పగిలి, చేతులు విరిగాయని తెలిపారు. పోలీసులు ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ సీఐఎస్ఎఫ్ సిబ్బంది వినిపించుకోకుండా కార్మికులను వేటాడి, వేటాడి లాఠీలు విరిగేలా కొట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్మికులపై సీఐఎస్ఎఫ్తో ఎందుకు లాఠీచార్జి చేయించిందో యాజమాన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనకు కారణమైన వారిని గుర్తించి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. గాయపడిన కార్మికులందరికీ యాజమాన్యం మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని, వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కార్మికులపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం
ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్
కాంటాక్ట్ కార్మికుల సమస్యలను అమలు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న జేఏసీ నాయకులు, కార్మికులపై అకస్మాత్తుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది లాఠీచార్జి చేయడాన్ని సీఐటీయూ అనుబంధ ఎన్టీపీసీ యునైటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ ఖండించింది. యూనియన్ అధ్యక్షులు ఎన్.బిక్షపతి, కార్యనిర్వాహక అధ్యక్షులు ఈ.భూమయ్య, ప్రధాన కార్యదర్శి బి.సారయ్య మాట్లాడుతూ.. గత వేతన ఒప్పందంలో ఎన్టీపీసీ యాజమాన్యం అంగీకరించిన డిమాండ్లను నాలుగేండ్లు అయినా అమలు చేయలేదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలను కల్పించడం, సీనియర్ కార్మికులకు ప్రమోషన్లు, టెక్నికల్ అర్హతలు ఉన్నవారికి స్కిల్ కార్మికులుగా పదోన్నతులు కల్పించడం వంటివి ఒప్పందం జరిగినా అమలు చేయకపోవడం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. న్యాయమైన కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లను వెంటనే చర్చించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జీ చేసిన వారిని, కారకులైన సీఐఎస్ఎఫ్ అధికారులు, వారిని ఉసిగొల్పి పారిశ్రామిక శాంతికి భంగం కలిగించిన ఎన్టీపీసీ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.