Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్లక్ష్య ధోరణిలో ఇరిగేషన్, హెచ్ఎమ్డీఏ అధికారులు
- ఇష్టానుసారంగా లే అవుట్లకు పర్మిషన్లు
- చెరువు, కుంటలు మాయం
- కనుమరుగవుతున్న వరద కాల్వలు
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రియల్ మాఫీయా చెరువు, కుంటలను మింగేస్తోంది. వరద కాల్వలను నామరూపాలు లేకుండా చేస్తోంది. చెరువు, కుంటలు, నాలాల జాగాలు కాపాడాల్సిన ప్రభుత్వం, అధికారులు.. కాసులకు కక్కుర్తిపడి ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇచ్చేస్తుండటంతో మాఫియా ఆడిందే ఆటగా సాగుతన్నది. ఇదే అదనుగా రియల్టర్లు చెరువు, కుంటల స్థలాల్లో వెంచర్లు వేస్తున్నారు. నాలాల కబ్జాలపై స్థానిక ప్రజలు అధికారులను ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాల చెప్తూ దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో రంగారెడ్డి జిల్లాలోని చెరువు, కుంటల భూములు మాయమవుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం సాయబ్నగర్లో ఓ డెవలపర్స్ సంస్థ ఇంజాపుర్ చెరువు నుంచి వచ్చే వరద కాల్వను మూసింది. ఈ స్థలంలో ఏకంగా సుమారు 7 ఎకరాల్లో వెంచర్ వేసి భవన నిర్మాణాలు చేపట్టింది. ఇందులో సుమారు రెండు ఎకరాలు వరద కాల్వ ఉంటుంది. ఇక్కడ భూమి విలువ ఎకరం సుమారు రూ.10 కోట్లు ఉంటుంది. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఈ వెంచర్లో నుంచి వరద కాల్వ వెళ్తుందన్న విషయాన్ని గుర్తించకుండా కాల్వ నామరూపాలు లేకుండా చేశారు. ఇదే మాదిరిగా మంచాల మండలం ఆగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో సాగర్ హైవేలో ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఏకంగా 10 నుంచి 15 ఎకరాల వరద కాలువను కమ్మేసి యథేచ్ఛగా తమ వెంచర్లో కలిపేసుకుంది. ఈ భూములు సాగర్ హైవేకు పక్కనే ఉండటంతో ఇక్కడ ఎకరం ధర సుమారు రూ. 2 కోట్ల నుంచి 3 కోట్ల వరకు పలుకుతోంది. ఈ లెక్కన ఆ సంస్థ ప్రభుత్వానికి సంబంధించి రూ.50 కోట్ల విలువ గల భూములను కబ్జా పెట్టింది. ప్రస్తుతం ఈ వరద కాలువను పూడ్చి పాట్లు చేయడంతో వరద నీరు దిగువ ప్రాంతంలో ఉన్న చెరువు, కుంటలకు వెళ్లకుండా అక్కడే నిలిచి ఇంకిపోతున్న పరిస్థితి నెలకొంది. బాలాపూర్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భవన నిర్మాణాలకు అధికారులు పర్మిషన్లు ఇవ్వడంతో ఇటీవల కురిసిన వర్షాలకు నిర్మాణాల ప్రాంతంలోని వరద నీరు వచ్చి చేరింది. ఇలా చెరువు, కుంటలు జాగాలను అక్రమించి అక్రమ పర్మిషన్లతో భవనాల నిర్మాణాలు చేపట్టి రియల్ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.
చెరువు, కుంటలు కాపాడి, నాలాల పరిధిలో రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ (రేరా) చట్టాన్ని తుంగలో తొక్కి నాలాలు పూడ్చిన ప్రాంతంలో అధికారులు, ప్రభుత్వం పర్మిషన్లు ఇవ్వడంపై అనుమానాఉల వక్తమవుతున్నాయి. ఇంజాపూర్ చెరువు నుంచి వచ్చే వరద కాల్వను పూడ్చి వెంచర్ వేసిన స్పెక్ట్రా ఇన్ఫ్రా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడమే ఇందుకు నిదర్శనం. ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలకు అధికారులు పర్మిషన్లు ఇవ్వడంతో ఈ ప్రాంతంలో నిర్మించిన భవనాలు కొనుగోలు చేసిన అమాయక ప్రజలు నట్టేటా మునుగుతున్నారు. చినుకు పడిందంటే ఈ ప్రాంతం మొత్తం వరదమయం అవుతుందని, ఇలాంటి ప్రాంతాల్లో నిర్మాణాలకు అధికారులు ఎట్లా అనుమతులు ఇస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడంతోపాటు ఇక్కడ నిర్మాణాలు జరగకుండా ప్రభుత్వం చొరవ చూపాలని వారు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
వరద కాల్వలు కబ్జా చేస్తే చర్యలు తీసుకుంటాం. హయత్నగర్ మండలం సాయిబ్నగర్లోని స్పెక్ట్రా ఇన్ఫ్రా చేపడుతున్న నిర్మాణాలతో వరద కాల్వలు పూడ్చే ప్రమాదం ఉందంటే పర్మిషన్లు రద్దు చేస్తాం. వరద కాలువను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
- నాగరాజు, ఇరిగేషన్ అధికారి