Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉజ్వలమైన స్థితిలోకి తీసుకెళ్లే బాధ్యత మనదే..
- మేధావులు కరదీపికలుగా మారాలి :
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
విశ్వజనీనమైన అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటిన గాంధీ పుట్టిన దేశాన్ని ఇప్పుడు ఉన్మాద స్థితిలోకి నెట్టేసే కుచితమైన, కుటిల ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఈ క్రమంలో కులం, మతం, భాషా బేధం లేకుండా, ధనిక, పేద తేడా లేకుండా అందరిని కలుపుకుని దేశాన్ని ఉజ్జలమైన స్థితిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని ఆయన తెలిపారు. సోమవారం హైదరాబాద్లోని ఎల్.బీ.స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సభలో ఆయన మాట్లాడారు. అట్టడుగు వర్గాల ప్రజల్లో ఇంకా ఆక్రోశం వినిపిస్తున్నదనీ, అనేక వర్గాల ప్రజలు ఇంకా తమకు స్వాతంత్య్ర ఫలాలు పూర్తి అందలేదనే భావనలో ఉన్నారని చెప్పారు. వీటన్నింటిని విస్మరించి దేశాన్ని ఉన్మాద స్థితిలోకి తీసుకెళ్తుంటే చూస్తూ మౌనంగా ఉండటం సరికాదని హితవు పలికారు. అర్థమైనా కానట్టు ప్రవర్తించడం మేధావుల లక్షణం కాదన్నారు. ధీరోదాత్తులు, మేధావులు, వైతాళికులు కరదీపికలుగా మారి ఏ సమాజాన్నైతే సక్రమ మార్గంలో నడిపిస్తారో ఆ సమాజానికీ పురోగమించే అవకాశముంటుందని సీఎం తెలిపారు. ప్రకృతి సంపద, ఖనిజ సంపద, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా యువశక్తి, మానవ సంపత్తి, మనుష్యుల రాజధానిగా ఉన్న మన దేశం పురోగమించాల్సినంతగా పురోగమించలేదని వ్యాఖ్యానించారు.
స్వాతంత్య్రం ఊరికే రాలేదనీ, దాని వెనుక అనేక మంది మహనీయుల ప్రాణ, ఆస్తి త్యాగాలున్నాయని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. మరోసారి స్వాతంత్య్రం, దాని వెనుక త్యాగాలను సింహావలోకనం చేసుకోవాలని సూచించారు. మనం స్వేచ్ఛా వాయువులను పీల్చేందుకు అవసరమైన స్వాతంత్య్రం రావడం వెనుక మహనీయుల కృషి ఉందని గుర్తుచేశారు. ఆ పోరాటంలో కీలకంగా ఉన్న మహాత్మాగాంధీ గురించి నేటి తరానికి తెలియజెప్పేందుకు వీలుగా ఏడాది కాలంగా కొన్ని కార్యక్రమాలు నిర్వహించామనీ, ముగింపుగా పంద్రాగస్టుకు ముందు, తర్వాత నిర్దిష్టంగా చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలిచ్చాయని హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఒక్కో రోజు ఒక్కో కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో స్వతంత్ర ఉద్యమంపై చర్చ నిర్వహించారని కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి తెలిపేందుకు నిర్వహించిన సామూహిక గీతాలాపనలో లక్షల మంది ఏకకాలంలో పాల్గొనడం, మహాత్మాగాంధీ సినిమాను 22 లక్షల మంది పిల్లలు చూడటంపట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా చూసిన వారిలో కనీసం 10 శాతం మంది స్ఫూర్తి పొందినా దేశం పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతటి శక్తిశాలురైనా నిలువరించగలిగిన అహింసా సిద్ధాంతాన్ని ప్రపంచానికి మహాత్మాగాంధీ చాటి చెప్పారని గుర్తుచేశారు. ఆయన లాంటి మహనీయుడు మరో వెయ్యేండ్ల వరకు జన్మించే అవకాశం లేదని యుఎన్ వ్యాఖ్యానించిందని తెలిపారు. అనేక దేశాలు గాంధీ పేరుతో గ్రంధాలయాలు, ఆయన విగ్రహాలు, పలు రూపాల్లో గుర్తు చేసుకుంటుండగా, మన దేశంలో కొంత మంది అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహాత్ముడు విశ్వమానవుడని కేసీఆర్ తెలిపారు. గాంధీ ఇచ్చిన స్ఫూర్తి కొనసాగాలని పిలుపునిచ్చారు.
అందరూ మమేకమయ్యారు...
-సీఎస్ సోమేశ్ కుమార్
వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలను అన్ని వర్గాలకు చెందిన ప్రజలు తమ ఇంటి పండుగలా భావించి మమేకమయ్యారని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. గాంధీ సినిమాను 546 సినిమా హాళ్లలో 22.30 లక్షల మంది విద్యార్థులు వీక్షించారని చెప్పారు. 1,462 ఫ్రీడం రన్లలో ఐదుల లక్షల మంది, ఉద్యోగులతో నిర్వహించిన 13,605 ఫ్రీడమ్ ర్యాలీలలో 18 లక్షల మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. 1.20 కోట్ల జాతీయ పతాకాలను ఉచితంగా అందజేసినట్టు సీఎస్ వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన హరితహారంలో 18,963 ప్రాంతాల్లో 37,66,963 మొక్కలు నాటినట్టు సీఎస్ చెప్పారు. సామూహిక గీతాలాపన కార్యక్రమంలో 95.23 లక్షల మంది పాల్గొన్నారని వివరించారు. ఎల్.బీ.స్టేడియంలో ప్రత్యేక పుస్తక ప్రదర్శన, గ్రేటర్ హైదరాబాద్ లోని 75 పార్కుల్లో వజ్రోత్సవ సంగీతవిభావరి నిర్వహించినట్టు వివరించారు.