Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ తగ్గుతారని వారి భావన
- నిరాధార ఆరోపణలు చేస్తే సహించబోం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి బంజారాహిల్స్
ఢిల్లీ మద్యం కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. నిరాధార అరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. కేసీఆర్ కుమార్తెను బద్నాం చేస్తే.. కేసీఆర్ తగ్గుతారని భావిస్తున్నారని, ఎంత ఒత్తిడి చేసినా కేసీఆర్ వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న సహస్ర చండీయాగం చివరి రోజు సోమవారం ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నామని, ఎవరికీ భయపడేది లేదని ధ్వజమెత్తారు. కేంద్రాన్ని విమర్శిస్తున్న కేసీఆర్‌ను తగ్గించడానికే బీజేపీ కుట్ర పూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఏ దర్యాప్తుకైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలనుకుంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, అయినా రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని గుర్తుచేశారు. కేంద్రం చేతిలో దర్యాప్తు సంస్థలు ఉన్నాయని, తాము ఏ దర్యాప్తుకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. బీజేపీ నేతలు విపక్షాలపై బట్టకాల్చి మీదేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారని, అయినా భయపడేది లేదని, కేసీఆర్ బాటలోనే నడుస్తామని, ఎవరికీ భయపడమని తేల్చి చెప్పారు. ఇకనైనా బీజేపీ ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు.
ఎమ్మెల్సీ కవిత ఇంటి ఎదుట ఉద్రిక్తత
లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఉన్నారని ఢిల్లీ బీజేపీ నేతల ఆరోపణల నేపథ్యంలో సోమవారం బంజారాహిల్స్‌లోని ఆమె ఇంటిని ముట్టడించడానికి బీజేపీ, బీజేవైఎం నేతలు ఒక్కసారిగా తరలివచ్చారు. చివరికి బీజేపీ, బీజేవైఎం నేతలను అరెస్టు చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.